లాక్​డౌన్​ ఒకేసారి ఎత్తేయం : ప్రధాని

లాక్​డౌన్​ ఒకేసారి ఎత్తేయం : ప్రధాని

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ను ఈనెల 14న ఒకేసారి ఎత్తేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఒకేసారి లాక్‌ డౌన్ ఎత్తి వేయలేమని, ఈ విషయంపై సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. 11వ తేదీన రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఆయన చర్చించనున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బుధవారం పలు పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘లాక్​డౌన్ ఎత్తేయడం లేదని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. కరోనా రాక ముందు.. వచ్చి వెళ్లిన తర్వాత దేశంలో పరిస్థితి ఒకేలా ఉండదని తెలిపారు..” అని బిజూ జనతా దళ్ నేత పినాకి మిశ్రా చెప్పారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, శివసేన నేత సంజయ్ రౌత్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ తదితరులు ఈ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. వీరికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను హెల్త్, హోం, రూరల్ డెవలప్​మెంట్ మినిస్ర్టీల సెక్రెటరీలు వివరించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్ల కొరత గురించి పలువురు ప్రతిపక్ష నేతలు లేవనెత్తారు. కొత్త పార్లమెంట్ నిర్మాణాన్ని ప్రస్తుతానికి అవైడ్ చేయాలని మరికొందరు సూచించారు. సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధానిని ఇంకొందరు అభినందించారు.

‘సోషల్ ఎమర్జెన్సీ’ లాంటిదే

దేశంలోని ప్రస్తుత పరిస్థితి సోషల్ ఎమర్జెన్సీ (సామాజిక అత్యవసర పరిస్థితి)తో సమానమని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని కామెంట్ చేశారు. ప్రతిక్షణం మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ఐక్యతను ప్రదర్శించడానికి అన్ని రాజకీయ వర్గాల కలిసి వచ్చాయని, నిర్మాణాత్మక, సానుకూల రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. సలహాలు సూచనలు ఇచ్చిన లీడర్లకు మోడీ థ్యాంక్స్ చెప్పారు. ఈనెల 11న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ అవుతారని అధికారవర్గాలు చెప్పాయి. లాక్​డౌన్, కరోనా తదితర అంశాలపై చర్చిస్తారని తెలిపాయి.

లాక్​డౌన్ పొడిగించొచ్చు: కాంగ్రెస్

కేంద్రం లాక్​డౌన్​ను పొడిగించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది. లాక్​డౌన్ పొడిగించాలని విజ్ఞప్తులు వచ్చాయని, అయితే ఎక్స్​పర్టులు, రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ప్రధాని చెప్పారని గులాం నబీ ఆజాద్ చెప్పారు. పీఎంతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న వారిలో 80 శాతం మంది లాక్​డౌన్ కొనసాగించాలని కోరారని అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా తీవ్రంగా ఎఫెక్ట్ అయిన రాష్ర్టాలకు స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రబీ పంటల సాగు కోసం లాక్​డౌన్ నుంచి రైతులను మినహాయించాలని, ఫర్టిలైజర్లపై ట్యాక్స్​లు ఎత్తేయాలని మరో నేత అధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు.