
ముంబై: భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ విమానాశ్రయమైన నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు, మహారాష్ట్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహొల్తో కలిసి బుధవారం (అక్టోబర్ 8) నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ఫస్ట్ ఫేజ్‌ను ఓపెనింగ్ చేశారు.
అదానీ గ్రూప్, సీఐడీసీవో సంయుక్తంగా పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ కింద రూ. 19,650 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్ పోర్టును నిర్మించారు. ఏడాదికి 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేయవచ్చు. నేవీ ముంబై ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ తగ్గనుంది.
దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ ఎయిర్ పోర్టు:
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ విమానాశ్రయం. పేపర్‌లెస్ ప్రయాణం కోసం డిగియాత్ర సాంకేతికతను ఉపయోగించనున్నారు. చెక్-ఇన్, చెక్ ఔట్, భద్రత, బోర్డింగ్ పాస్ సర్వీస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగిస్తారు.- ఫస్ట్ టెర్మినల్‌లో 66 చెక్-ఇన్ కౌంటర్లు, 22 సెల్ఫ్-బ్యాగేజీ డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికుల వేచే ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.
►ALSO READ | సింగర్ జుబీన్ గార్గ్ కేసులో ట్విస్ట్: సింగపూర్ యాచ్ పార్టీకి వెళ్లిన అస్సాం డీఎస్పీ అరెస్ట్
విమానాశ్రయం అధికారికంగా ప్రారంభించబడినప్పటికీ వాణిజ్య విమాన కార్యకలాపాలు డిసెంబర్ 2025లో ప్రారంభమయ్యే కానున్నట్లు సమాచారం. ప్రయాణికుల సాధారణ సేవలు మాత్రం వెంటనే ప్రారంభంకానున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్ వంటి ప్రధాన దేశీయ విమానయాన సంస్థలు ఈ పోర్టు నుంచి తమ కార్యాకలాపాలను ప్రారంభించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.