బానిస మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి

బానిస మనస్తత్వం నుంచి  దేశానికి విముక్తి

వారణాసి:  బానిస మనస్తత్వం నుంచి దేశం స్వాతంత్ర్యం ప్రకటించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన వారసత్వాన్ని చూసి దేశం గర్విస్తున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ‘స్వర్వేద్ మహామందిర్‌‌‌‌‌‌’ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్ర్యానికి ముందు భారతదేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేసిన వాళ్లు.. ముందు మన చిహ్నాలను లక్ష్యంగా చేసుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత.. ఈ సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించడం చాలా అవసరమైంది. కానీ నాడు సోమ్‌‌నాథ్ ఆలయ పునర్నిర్మాణంపై వ్యతిరేకత వచ్చింది. దశాబ్దాలపాటు ఈ ఆలోచనా విధానమే కొనసాగింది. దీని పర్యవసానంతో దేశం ఇన్‌‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌‌లోకి చేరిపోయింది” అని చెప్పారు. 

వేగంగా రామ్​ సర్క్యూట్​ పనులు..

‘‘స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత.. కాలచక్రం మరోసారి తిరగబడింది. బానిసత్వ మనస్తత్వం నుంచి స్వాతంత్ర్యాన్ని ఎర్రకోట నుంచి దేశం ప్రకటించింది. ఇప్పుడు తన వారసత్వాన్ని చూసి గర్వపడుతున్నది. సోమ్‌‌నాథ్ ఆలయం నుంచి మొదలైన పని.. ఇప్పుడు ఓ క్యాంపెయిన్‌‌లా మారింది” అని ప్రధాని మోదీ అన్నారు. బుద్ధ సర్క్యూట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ద్వారా.. బుద్ధుడు ధ్యానం చేసిన ప్రాంతాలను చూసేందుకు ప్రపంచాన్ని ఆహ్వానించామని చెప్పారు. రామ్ సర్క్యూట్ డెవలప్‌‌మెంట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

వారణాసి అంటే పరిశుభ్రత, అభివృద్ధి

‘‘తన సామాజిక సత్యాలను, సాంస్కృతిక గుర్తింపును ఏకం చేసినప్పుడే సమగ్ర అభివృద్ధి వైపు అడుగులు వేయగలం. మన పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో వారణాసిని చూస్తే తెలిసిపోతుంది’’ అని మోదీ తెలిపారు. వారణాసి అంటే ఇప్పుడు పరిశుభ్రత, పరివర్తన, అభివృద్ధి, ఆధునిక సౌకర్యాలని అన్నారు. తర్వాత యూపీ సీఎం యోగితో కలిసి ధ్యాన మందిరాన్ని మోదీ పరిశీలించారు. ఒకేసారి 20,000 మంది కూర్చుని మెడిటేషన్ చేసేలా దీనిని నిర్మించారు. ఏడంతస్తుల్లో నిర్మితమైన మహామందిర్ గోడలపై స్వరవేద శ్లోకాలను చెక్కారు.

ప్రజలకు తొమ్మిది విజ్ఞప్తులు  

1.ప్రతి నీటి బొట్టును పొదుపు చేయండి. నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించండి. 
2. ప్రతి గ్రామానికి వెళ్లి డిజిటల్ లావాదేవీల గురించి ప్రజలకు అవగాహన కల్పించండి.
3. మీ గ్రామం, మీ ప్రాంతం, మీ నగరం పరిశుభ్రతలో నంబర్‌‌వన్‌‌ అయ్యేందుకు పని చేయండి.
4. లోకల్‌‌ ప్రొడక్టులను ప్రమోట్ చేయండి. మేడిన్ ఇండియా వస్తువులనే వాడండి.
5. వీలైనంత వరకు ముందు దేశమంతా పర్యటించండి. ఆ తర్వాతే విదేశీ టూర్లకు వెళ్లండి.
6. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు తెలియజేయండి.
7. ఆహారంలో మిల్లెట్లను భాగం చేసుకోండి.
8. ఫిట్‌‌గా ఉండేందుకు యోగా, క్రీడలు వంటి వాటిని జీవితంలో భాగం చేసుకోండి.
9. కనీసం ఒక్క పేద కుటుంబానికైనా మద్దతుగా నిలవండి అని పిలుపునిచ్చారు.