
న్యూఢిల్లీ: చట్టానికి లోబడి పాలన చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. తమ దేశ పౌరులు విదేశాల్లో ఏదైనా తప్పు చేసినట్టు ఎవరైనా సమాచారం ఇస్తే, దానిపై తప్పకుండా విచారణ జరిపిస్తామని తెలిపారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రలో ఇండియాకు చెందిన నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందంటూ అమెరికా ఇటీవల చేసిన ఆరోపణలపై మోదీ స్పందించారు.
బ్రిటన్ పేపర్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘‘మా పౌరులెవరైనా విదేశాల్లో చెడు గానీ చేసినట్టయితే, దాన్ని పరిశీలించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఏదైనా సమాచారం ఇస్తే, తప్పకుండా విచారణ జరిపిస్తాం. మా ప్రభుత్వం చట్టానికి లోబడి పనిచేస్తుంది” అని చెప్పారు. కొన్ని టెర్రర్ గ్రూప్స్ విదేశాల నుంచి ఇండియాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
మా బంధం బలంగా ఉంది..
ఇండియా, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని మోదీ తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను రెండు దేశాల మధ్య సంబంధాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ‘మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మేం ముందుకెళ్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి” అని పేర్కొన్నారు. కాగా, గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు ఇండియాకు చెందిన నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని, అతనికి ఇండియన్ ఆఫీసర్ నుంచి ఆదేశాలు అందాయని అమెరికా ఆరోపించింది.