పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ను ప్రారంభించిన ప్రధాని

పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ను ప్రారంభించిన ప్రధాని
  • 23 ఏండ్లు నిండాక రూ.10 లక్షలు.. పై చదువులకు లోన్​

న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవడానికి ‘పీఎం కేర్స్ ఫర్​ చిల్డ్రన్’ స్కీమ్​ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ స్కీంలో భాగంగా స్కూల్​ పిల్లలకు స్కాలర్​షిప్​లు, పీఎం కేర్స్​ ఫర్​ చిల్ట్రన్​ పాస్​బుక్స్, ఆయుష్మాన్​ భారత్​లో భాగంగా ప్రధాన మంత్రి జన్​ ఆరోగ్యయోజన కింద హెల్త్​ కార్డులు అందజేశారు. ప్రొఫెషనల్​కోర్సులు, ఉన్నత విద్య చదవాలనుకునే వారికి ఎడ్యుకేషన్​ లోన్లు ఇచ్చి పీఎం కేర్స్ సాయపడుతుందని ప్రధాని మోడీ చెప్పారు.  ఈ చిన్నారుల రోజువారీ అవసరాల కోసం ప్రతి నెలా రూ.4 వేలు అందిస్తామన్నారు. 18 నుంచి 23 ఏండ్ల మధ్య విద్యార్థులకు స్టైఫెండ్​ అందుతుందని, 23 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత రూ.10 లక్షలతో పాటు ఆయుష్మాన్​ భారత్​ కింద వారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని, హెల్ప్​ లైన్​ ద్వారా సైకలాజికల్​గా, ఎమోషనల్​గా సాయం అందిస్తామని ప్రధాని చెప్పారు. ఈ చిన్నారులకు దేశం మొత్తం అండగా ఉంటుందని, దానికి నిదర్శనమే పీఎం కేర్స్ ఫర్​ చిల్డ్రన్​ అని చెప్పారు. చదువు ద్వారా వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయడానికే పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ను తీసుకొచ్చామని ప్రధాని మోడీ చెప్పారు. వారికి లాడ్జింగ్, బోర్డింగ్ సదుపాయాలు అందిస్తామన్నారు. స్కాలర్​షిప్​లు అందించడంతో పాటు 23 ఏండ్లు వచ్చిన తర్వాత స్వయం ఉపాధిని పొందేలా రూ.10 లక్షలు అందిస్తామని, హెల్త్​ ఇన్సూరెన్స్​ ద్వారా ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తామని చెప్పారు.  కరోనా సమయంలో ఆస్పత్రుల్లో సౌలతులకు, వెంటిలేటర్ల కొనుగోలుకు, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ ఎంతో సహాయపడిందని అన్నారు. దీనివల్ల ఎన్నో ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. ఈ జర్నీలో దేశ యువత కీలకపాత్ర పోషించారన్నారు.