మోర్బీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన మోడీ

మోర్బీ  ఘటనా స్థలాన్ని పరిశీలించిన మోడీ

గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన మోడీ... గాయపడ్డ వారిని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోడీతో పాటుగా ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌ కూడా క్షతగాత్రులను పరామర్శించారు.ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 135కి చేరింది. కొంతమంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు.  వారి కోసం మచ్చు నదిలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు  గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.