
ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన ముగిసింది. ఒకరోజు పర్యటనలో భాగంగా నేపాల్ వెళ్లిన మోడీ ముందుగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవాతో కలిసి లుంబినిలోని మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న మహోబోధి చెట్టుకు నీళ్లుపోశారు. అనంతరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరువురు ప్రధానులు చర్చించారు. ఇందులో భాగంగా భారత్-నేపాల్ మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్స్ రిలేషన్స్, లుంబిని బుద్ధిస్ట్ యూనివర్శిటీ, త్రిభువన్ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన వివిధ ఒప్పందాలు జరిగాయి.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమన్నారు మోడీ. భారత్-నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారున. బుద్ధుడి పట్ల ఆరాధన ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తూ ఒకే కుటుంబంగా మారుస్తోందని చెప్పారు. బుద్ధుడు జన్మించిన నేలపై ఉన్న శక్తి ఉత్తేజకరంగా ఉందన్న మోదీ.. ఇది విభిన్న అనుభూతిని పంచుతోందన్నారు. 2014లో లుంబినిలో నాటేందుకు తాను పంపించిన మహాబోధి మొక్క ఇప్పుడు చెట్టుగా మారిందన్నారు. నేపాల్‌తో భారత్‌కు ఉన్న అనుబంధం హిమాలయాల పర్వతాల స్థాయికి చేరాలని మోడీ ఆకాంక్షించారు. కాగా 2014 తరువాత ప్రధాని మోదీ నేపాల్‌కు వెళ్లడం ఇది ఐదోసారి.