ఇంకా వెనకేసుకొస్తే..నాయకత్వానికే అనర్థం

ఇంకా వెనకేసుకొస్తే..నాయకత్వానికే అనర్థం

ముందుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మీడియా వక్రీకరించిందనో లేదా నా ఉద్ధేశం అది కాదనో తప్పించుకోవడం లేదా  సంజాయిషీ ప్రకటనలు ఇవ్వడం మన రాజకీయాల్లో  పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. అలాంటి రబ్బిష్​ కామెంట్లు దేశ రాజకీయాల్లో సహజం కావచ్చు. కానీ ప్రస్తుతం తీవ్రవాదులను అంతమొందించేందుకు చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​ మూడు రోజుల తర్వాత కాల్పుల విరమణతో ఆగిపోయిన తర్వాత  వివాదాస్పద, అభ్యంతరక వ్యాఖ్యలు ఎవరికి శోభనిస్తాయి? నాయకుడి మెప్పుకోసమో లేదా తన పాపులారిటీ  కోసమో మాట్లాడితే  దేశం, సైన్యం ప్రతిష్ఠ  ఏం కావాలి? మధ్యప్రదేశ్​కు చెందిన ఒక ఉపముఖ్యమంత్రి, ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎవరూ సహించలేనివి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం కానీ, పార్టీ కానీ అంతే సీరియస్​గా వారిపై చర్యలు కనిపించకపోవడం మరింత ఆలోచింపజేస్తున్న అంశం.

మధ్యప్రదేశ్​ మంత్రి విజయ్​ షా..  కర్నల్​ సోఫియా ఖురేషీని తీవ్రవాదుల సోదరిగా పోల్చి మాట్లాడటం చూస్తే ఎవరిని అవమానించినట్లు? మన ఆర్మీలో అన్ని మతాల వారుంటారు. అందులో ఫలానా మతం వారిని శత్రుదేశం సోదరులనో, సోదరి అనో పోల్చడాన్ని  ఎలా జీర్ణించుకోగలం? ఈయన వ్యాఖ్యను మధ్యప్రదేశ్​ హైకోర్టు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడం, కేసు నమోదుకావడం, దాన్ని  విజయ్​షా సుప్రీం  కోర్టులో సవాల్​ చేయడం, హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సుప్రీం ఆదేశించడం, విజయ్​షా హైకోర్టులో క్షమాపణ చెప్పడం, కోర్టు ఆదేశాల మేరకే ఆయన క్షమాపణ చెప్పారు తప్ప, ఆయన క్షమాపణలో నిజాయితీ లేదని సుప్రీం కోర్టు ఆయన క్షమాపణను కొట్టేయడమూ జరిగాయి. ఈ కేసుపై సుప్రీంకోర్టు ముగ్గురు సీనియర్​ ఐపీఎస్​లతో సిట్​ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. న్యాయ వ్యవస్థ కల్పించుకుంటే తప్ప, ఇలాంటి నేతలపై అతని పార్టీగానీ, ప్రభుత్వంగానీ చర్యలు తీసుకోకపోవడమే ఇక్కడ చర్చనీయాంశం.  ఈ వ్యాసం రాసే సమయానికి మాత్రం మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ఆ ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారమైతేలేదు.

యుద్ధ నీతి తెలియని మంత్రి అల్పపూరిత  వ్యాఖ్య

సిందూర్​ ఆపరేషన్​ సమయంలో రోజూ జరుగుతున్న సంఘటనలపై ప్రపంచానికి చెప్పడానికి ఫారిన్ సెక్రటరీతో పాటు, ఇద్దరు మహిళా వింగ్ కమాండర్ లు ఒకరు సోఫియా ఖురేషీ, మరొకరు వ్యోమికా సింగ్ లను తమాషా కోసం పెట్టలేదు. ప్రపంచం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్​​ ఉద్దేశాన్ని అర్థం చేసుకునేందుకే పెట్టారు. వాళ్లను నియమించిందీ స్వయాన ప్రధాని మోదీ ప్రభుత్వమే కదా!  కేంద్ర ప్రభుత్వమే ఆపరేషన్​ బ్రీఫింగ్​ కోసం నియమించిన సోఫియా ఖురేషీపై, అదే బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర మంత్రి అలాంటి వ్యాఖ్య చేయడమేంటనేదే  ఈ దేశ ప్రజలను ఆశ్చర్యపరిచింది! మన యుద్ధనీతి గురించి కాస్తయినా   మంత్రి విజయ్​ షాకు అవగాహన ఉండి ఉంటే.. తీవ్రవాదులను ఉద్దేశిస్తూ మీ సోదరితో (సోఫియా ఖురేషీతో) జవాబు చెప్పిస్తున్నాం అంటాడా? ఆయన శృతిమించిన పైత్యంపై కోర్టులు కల్పించుకున్నాయి తప్ప, ఆయన పార్టీగానీ, ప్రభుత్వంగానీ స్పందించినట్లు లేదు. ఇది ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని  పంపుతుందో ఆయన పార్టీయే ఆలోచించాల్సిన విషయం.

మోదీ వినమ్రతకే పరీక్ష పెట్టిన మరో మంత్రి

అదే మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన ఉపముఖ్యమంత్రి జగదీశ్​ దేవ్​డా మరొక ముందడుగేసి..  సైన్యం, దేశ ప్రజలు మోదీ కాళ్లు మొక్కాలన్నాడట! నిజానికి తన కాళ్లు మొక్కడానికి ఎవరు వచ్చినా.. వాళ్ల కాళ్లే మొక్కే మోదీ వినమ్రతను, గొప్పతనాన్ని ఈ దేశం చూసింది, ప్రశంసించింది. అలాంటి మోదీని అపవాదు  చేయడానికేనా అన్నట్లుగా ఆ డిప్యూటీ సీఎం ప్రజలను, జవాన్లను మోదీ కాళ్లు మొక్కాలని చెప్పడం? ఆ వెనువెంటనే నేను  అలా చెప్పలేదు అనే సంజాయిషీలు షరామామూలే!  ఈ బరితెగింపు వ్యాఖ్యలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయి? కోట్లాది భారతీయుల మనసు దోచుకున్న ప్రధాని నరేంద్రమోదీ ఇటు వైపుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారో తెలియదు! 

చర్యలు తీసుకుంటే తప్ప..

బాధ్యతాయుతమైన తమ ప్రభుత్వంలోనే ఉన్న మంత్రుల శృతిమించిన వ్యాఖ్యల వల్ల నష్టపోయేది ఎవరు? అలాంటి వారి వల్ల .. మోదీ పరువే కాదు, ఈ దేశ పరువు, ఆర్మీ ప్రతిష్ఠ ఏమవుతదో స్వయాన ప్రధాని మోదీనే ఆలోచించాల్సిన విషయం. లేదంటే,వారి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లింది. అలా మరింతగా వెళ్లకూడదనుకుంటే..వెంటనే శృతిమించిన వారిపై  కోర్టుల కన్నా ముందే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే కొంతైనా మేలు జరగొచ్చేమో! అదంతా ప్రధాని మోదీపైనే ఆధారపడిన విషయం అని ప్రజల అభిప్రాయం.
 
నాలుకలు బాగా జారుతున్నాయ్​!

‘నాలుకలు బాగా జారుతున్నాయి. కట్టడి చేయకపోతే..దేశభక్త పార్టీకి దేశం దూరమయ్యే ప్రమాదం!’ అనే ఈ వ్యాఖ్య నా సోషల్​ మీడియా అకౌంట్ లో  పోస్టు చేశాను. దానికి అందరితో పాటు బీజేపీ, ఆర్ఎస్​ఎస్​ సానుభూతి పరుల నుంచి కూడా లైక్​లు వచ్చాయి. ఆ మంత్రుల శృతిమించిన వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా ఎవరూ సహించలేకపోతున్నారనడానికి అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది? ఆలోచించాల్సింది ఆ పార్టీ, మోదీ మాత్రమే! ఇతర పార్టీల నేతల నాలుకలు కూడా జారుతున్నాయి.   ఏది ఏమైనా అధికార పార్టీ నేతల నోటికట్టడి సరిగా ఉంటే.. ఇతర పార్టీల నోటికట్టడిని ఎత్తిచూపడం చాలా సులభం అనే విషయాన్ని గమనించాలి. 

విద్రోహుల విజృంభణ మరోవైపు పాకిస్తాన్​కు మన భద్రతాదళాలకు సంబంధించిన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్​ పాకిస్తాన్​కు అందించిందనేది మరింత ఆందోళనకు గురిచేస్తున్న  వార్త. ఇంకోవైపు హైదరాబాద్​లోనూ ఇద్దరు ఐసీస్​ తీవ్రవాదులసంబంధీకులు పేలుళ్లకు కుట్ర పన్నారనే వార్త.  అటు శృతిమించిన మంత్రుల వ్యాఖ్యలు, ఇంటి దొంగల్లాటి ద్రోహులు వెరసి దేశం ఎటు పోతుందనే మీమాంసలు సగటు బుద్ధిజీవులను వేధిస్తున్నాయి.  

ఇంకా వెనకేసుకొస్తే..

దేశంలో తనకు సమానమైన నాయకత్వం మరొకటి లేకపోవడమే మోదీకి ఇప్పటికీ కలిసొస్తున్న అంశం కావచ్చు. మోదీ ముందుగా తన పార్టీ నేతల అదుపుతప్పిన మాటల తీరును కట్టడి చేయాలి. తమ ప్రభుత్వ నీతిని కాదని వ్యాఖ్యలు చేస్తున్న  పార్టీ నేతలను ఇంకా వెనకేసుకు వస్తే.. అది తన నాయకత్వానికే అనర్థంగా మారుతుందని గమనించాలి.  అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడం, దౌత్యపరంగా పాక్​పై పూర్తి విజయం సాధించడంపై దృష్టి పెట్టి పనిచేయడమే ప్రస్తుతం మోదీ నాయకత్వ సమర్థతకు పరీక్ష కానుంది.

క్రమశిక్షణ ఎటుపాయె?

ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ అనగానే, అదో  దేశభక్తి పార్టీ అనే సిక్స్​త్​​​సెన్స్​ ను  చాలామంది భారతీయుల్లో మనం చూస్తుంటాం. అదొక క్రమశిక్షణకు మారుపేరు పార్టీగా కూడా పరిగణిస్తుంటారు.  బీజేపీ వ్యతిరేకులు సైతం ఇష్టం ఉన్నా లేకున్నా దాని క్రమశిక్షణ ను ఆయా సందర్భాల్లో కోట్​ చేసి మరీ చెపుతుంటారు. బీజేపీ అనగానే అదొక హిందూత్వ పార్టీగా మాత్రమే ప్రజలు చూడడం లేదని ఆ పార్టీ ఎందుకో మర్చిపోతున్నది. అదొక స్టేబుల్​ పార్టీ. కొంతమెరుగైన క్రమశిక్షణ గల పార్టీ. దేశంలో పట్టున్న పార్టీ గా ఎదిగింది. ఇవాళ దానికో స్ట్రాంగ్​ లీడర్​షిప్​ ఉంది. ఆయనొక టాలెస్ట్ పర్సనాలిటీగా దేశ రాజకీయాల్లో నిలిచిపోయారు.​ ఇలాంటి  అదనపు లక్షణాలే లేకుంటే పదేండ్లుగా ఆ పార్టీ ఇన్ని ప్రజాతీర్పులు పొందేది కాదు. ఈ విషయాన్ని బీజేపీ ఎక్కడో మర్చిపోతున్నది. ఎందుకంటే, సొంత పార్టీ మంత్రులే  శృతిమించిన వ్యాఖ్యలు చేయడం, వ్యక్తి ఆరాధనకు అలవాటు పడి.. జవాన్లు, జనాలు మోదీ కాళ్లు మొక్కాలనే దాకా వెళ్లడం.. బీజేపీలో పెరిగిపోతున్న అవలక్షణాలను వెల్లడిస్తున్నాయి. అది ఆ పార్టీకి మాత్రమే నష్టం చేసే వ్యాఖ్యలు కావు. అంతకు మించి ప్రజలను బాధిస్తున్న  వ్యాఖ్యలని  గమనించాలి. 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
పొలిటికల్​ ఎనలిస్ట్​