పట్టు వస్త్రాలు, వెండి గొడుగు బహుకరించిన ప్రధాని మోడీ..

పట్టు వస్త్రాలు, వెండి గొడుగు బహుకరించిన ప్రధాని మోడీ..

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది.  వేదమంత్రాల నడుమఅయోధ్యలో వైభవంగా బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12.29కి అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. 84 సెకన్ల దివ్య ముహూర్తంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. 

 ప్రాణప్రతిష్ఠ సమయంలో రామనామ స్మరణతో ఆలయం మార్మోగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. శ్రీరాముడికి పట్టు వస్త్రాలు, వెండి గొడుగు బహుకిరించారు. అనంతరం శ్రీరాముడిని దర్శించుకుని ప్రధాని మోదీ తరించిపోయారు. చాలా ఎమోషనల్ అయ్యారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోడీ.

రామమందిరం పున:ప్రారంభం సందర్భంగా పవిత్ర అయోధ్యలో పండుగ వాతావరణం కన్పిస్తోంది. నగరం రామనామస్మరణతో మార్మోగుతోంది. రామమందిరాన్ని 2వేల క్విటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు బాల రామయ్య విగ్రహానికి 114 కలశాల నీటిని ఉపయోగించి ఉత్సవ స్నానం చేయించారు.  నగరమంతా రాముడి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. 

ఈ మహత్తర కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నాగ సాధువులు సందడి చేశారు. భారీ ర్యాలీగా అయోధ్యకు నాగసాధువులు తరలివచ్చారు.  స్థానికులు వాళ్లకు ఘనస్వాగతం పలికారు. నాగసాధువుల కర్రసాము, కత్తిసాము అందరిని ఆకట్టుకుంది.