ఫ్లడ్స్ నివారణకు స్పెషల్ ప్రాజెక్ట్.. అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ఫ్లడ్స్ నివారణకు స్పెషల్ ప్రాజెక్ట్.. అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
  • దేశంలోనే తొలిసారిగా చెన్నైలో అమలుకు నిర్ణయం
  • మొత్తం ఖర్చు రూ.561 కోట్లు.. కేంద్ర వాటా రూ.500 కోట్లు

న్యూఢిల్లీ/చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైని తరచూ వరదలు ముంచెత్తుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వరదల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోనే తొలిసారి అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్టును చెన్నైలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్ మెంట్ యాక్టివిటీస్ ఫర్ చెన్నై బేసిన్ ప్రాజెక్ట్’కు ఆమోదం తెలిపింది. దీనికింద రూ.561.29 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికి అయ్యే ఖర్చులో కేంద్రమే రూ.500 కోట్లు భరిస్తుందని చెప్పారు. ‘‘చెన్నైలో గత 8 ఏండ్లలో మూడుసార్లు భారీ వరదలు వచ్చాయి. దేశంలోని చాలా మెట్రోపాలిటన్ సిటీల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో సడెన్ గా వరదలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్బన్ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్టుకు ప్రధాని ఆమోదం తెలిపారు” అని పేర్కొన్నారు.  

రెండు రాష్ట్రాలకు విపత్తు నిధులు..

మిగ్ జాం తుఫాన్ కారణంగా అతలాకుతలమైన తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ కు విపత్తు నిధులను ముందుగానే విడుదల చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని అమిత్ షా తెలిపారు. ‘‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్)కు రెండో విడత కింద ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా తమిళనాడుకు రూ.450 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.493.60 కోట్లు విడుదల చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ రెండు రాష్ట్రాలకు మొదటి విడతలో ఇంతే మొత్తంలో నిధులు శాంక్షన్ చేశాం” అని ఆయన పేర్కొన్నారు.

రాజ్‌‌‌‌ నాథ్ ఏరియల్ సర్వే..

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం తమిళనాడులో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సెక్రటేరియెట్ లో సీఎం స్టాలిన్ తో కలిసి హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘తమిళనాడులో వర్షాలు, వరద నష్టంపై ప్రధాని ఆవేదన చెందారు. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించాలని నన్ను ఆదేశించారు. సీఎం స్టాలిన్ తో కూడా ప్రధాని ఫోన్ లో మాట్లాడారు” అని ఆయన చెప్పారు.

ఇంకా తగ్గని వరద..

వర్షాలు తగ్గుముఖం పట్టి రెండ్రోజులైనా చెన్నైలో వరదలు తగ్గలేదు. చెన్నై సిటీ, శివారులోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరదలోనే చిక్కుకున్నాయి. వరద వల్ల బయటకు రాలేక ఆయా ప్రాంతాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరెంట్.. పాలు, నీళ్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సౌత్, నార్త్ చెన్నైలో పరిస్థితి దారుణంగా ఉంది. అయితే వరదలు తగ్గని ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగానే కరెంట్ కట్ చేశామని అధికారులు పేర్కొన్నారు. చెన్నైలోని స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం కూడా సెలవును ప్రకటించారు.