
- పీఎం కిసాన్ 11వ విడత నిధులు రిలీజ్ చేసిన మోడీ
- ప్రధానమంత్రిని కాదు.. ప్రధాన సేవకుడినే
- నా జీవితం దేశ ప్రజల కోసమే అంకితం : ప్రధాని
సిమ్లా: పీఎం కిసాన్ పథకం కింద 11వ విడతగా రూ.21 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతుల ఖాతాల్లోకి రిలీజ్ చేశారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మందికిపైగా రైతులు ప్రయోజనం పొందనున్నారు. మంగళవారం హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారితో ఆయన వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రధానమంత్రిని కాదు.. ప్రధాన సేవకుడిని మాత్రమే. 130 కోట్ల మంది భారతీయుల కుటుంబంలో ఒకడిని. నా జీవితం భారతీయుల కోసమే అంకితం’ అని చెప్పారు.
గతంలో ప్రభుత్వంలో అవినీతి ఓ భాగం
2014కు ముందు నాటి ప్రభుత్వాల్లో అవినీతి అనేది అంతర్భాగంగా ఉండేదని, కానీ గత ఎనిమిదేండ్లలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని మార్చామని, అవినీతిని సహించేదిలేదని తమ చేతల ద్వారా నిరూపించామని అన్నారు. అప్పుడు రోజూ స్కాముల గురించి చర్చ జరిగితే.. ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగుతోందని చెప్పారు. మన సరిహద్దులు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా మారాయన్నారు. బిలాస్పూర్లో ఎయిమ్స్ ఏర్పాటును ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
నగదు బదిలీ కింద22 లక్షల కోట్లిచ్చినం
తాము అధికారంలోకి వచ్చాక వివిధ స్కీముల జాబితాల నుంచి 9 కోట్ల మంది ఫేక్ లబ్ధిదారుల పేర్లను తొలగించామని చెప్పారు. నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల్లో అవినీతికి చోటు లేకుండా చేశామన్నారు. ఇప్పటి వరకూ వివిధ స్కీముల కింద 22 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసినట్టు చెప్పారు. దేశంలో పేదరికం తగ్గుతోందని, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే విషయం చెబుతున్నయని అన్నారు.కరోనా టైంలో దేశ ప్రజలకు 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించామని, విదేశాలకూ ఎగుమతి చేశామని గుర్తుచేశారు. ఇందులో హిమాచల్‌లోని బడ్డి ఇండస్ట్రియల్ యూనిట్ కీలకపాత్ర పోషించిందన్నారు.