మేఘాలు అడ్డుంటే రాడార్లు పసిగట్టలేవు: మోడీ

మేఘాలు అడ్డుంటే రాడార్లు పసిగట్టలేవు: మోడీ

న్యూఢిల్లీఎన్నికల ప్రచారంలో జెట్​ స్పీడుతో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీని మేఘాలు ఇరుకునపెట్టాయి. ఆర్మీ ఆపరేషన్స్​పై మాట్లాడొద్దన్న ఈసీ సూచనల్ని పక్కనపెడుతూ, బాలాకోట్​ ఎయిర్​స్ట్రైక్స్​పై ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ‘‘ఆకాశంలో మేఘాలు అడ్డుండటం వల్లే మన యుద్ధవిమానాల్ని పాకిస్థాన్ రాడార్లు పసిగట్టలేకపోయాయి”అంటూ మోడీ చెప్పిన లాజిక్​పై ప్రతిపక్షాలు ఘొల్లుమన్నాయి. సోషల్​ మీడియాలోనైతే సెటైర్ల వరదపారింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో చివరికి బీజేపీ.. ప్రధాని కామెంట్ల తాలూకు పోస్టుల్ని తొలగించింది.

ఇదెక్కడి లాజిక్​ సార్​?

మేఘాలు అడ్డుంటే రాడార్లు విమానాల్ని పసిగట్టలేవన్న మోడీ లాజిక్​పై సర్వత్రా సెటైర్లు పేలాయి. మేఘాలు దట్టంగా ఉన్నా, అవతల ఏముందో పసిగట్టేందుకే రాడార్ టెక్నాలజీ రేడియో తరంగాలను వాడతారని, ఆరోజు బాలాకోట్​ ఏరియాలో మేఘాల వల్ల ఐఏఎఫ్​కి ఎలాంటి అదనపు ఉపయోగం లేదని పలువురు రాడార్​ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇటు సోషల్​ మీడియాలోనైతే సెటైర్లమీద సెటైర్లు పేలాయి. ‘‘రాడార్లకు మేఘాలు అడ్డుండటమేంటి సార్, లాభంలేదు, మన ఎయిర్​ఫోర్స్ హెడ్​ క్వార్టర్​ని చిరపుంజికి తరలించాల్సిందే. ఎందుకంటే అక్కడ 356 రోజులూ వర్షం, మేఘాలు ఉంటాయి మరి”అని ఓ నెటిజన్ చురకంటిస్తే, ‘‘ఇంకా నయం, ఫైటర్​ విమానాల్ని రివర్స్ గేర్​లో నడపమని మోడీగారు చెప్పలేదు. అప్పుడు విమానాలు తమ భూభాగంలోకి వస్తున్నాయో, వెళుతున్నాయో పాకిస్థానోళ్లకి అర్థం కాకపోయేది” అంటూ ఇంకొకరు జోక్​ పేల్చారు. ‘‘గటర్​(మురికి కాలువ) నుంచి గ్యాస్ తయారీనే హైలైట్​ అనుకున్నా, అంతలోనే మేఘాలు–రాడార్ల లాజిక్​ చెప్పారు.. వాహ్ మోడీజీ”అని మరో యువకుడు కామెంట్​ చేశాడు. ‘‘చల్లగా ఉంటుంది కాబట్టి సూర్యుడి మీదికి రాత్రివేళ స్పేస్​ షిప్​ని పంపమన్నట్లుంది మోదీ వ్యవహారం”తరహాలో బోలెడు జోకులు పేలాయి. శనివారం రాత్రి నుంచి సోషల్​ మీడియాలో విమర్శలు రావడంతో తప్పు గ్రహించిన బీజేపీ శాఖలు, మోడీ వీడియోలున్న అన్ని పోస్టుల్ని తొలగించడం గమనార్హం.

ఐదేండ్లుగా ఇదే తీరు!

‘‘జుమ్లా(మోసపూరిత మాటలు) చెప్పడం మోడీకి అలవాటే. గడిచిన ఐదేండ్లుగా ఆయన చేస్తున్నదదే. మేఘాలు అడ్డున్నా, రాడార్లకు చిక్కకుండా మోసం చేస్తూనేఉన్నారు’’ అని  కాంగ్రెస్ విమర్శించింది.

ఇంతకీ మోడీ ఏం చెప్పారంటే..

శనివారం రాత్రి ఓ చానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోడీ, బాలాకోట్​ ఎయిర్​స్ట్సైక్స్​ అంశాన్ని ప్రస్తావిస్తూ, దాడికి సంబంధించిన కీలక విశయాల్ని చెప్పుకొచ్చారు. ‘‘అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎయిర్​స్ట్సైక్స్​పై రివ్యూ మీటింగ్​ జరిగింది. ఆ రోజు(ఫిబ్రవరి 26) వాతావరణం అనుకూలంగా లేదు. భారీ వర్షం కురిసింది. నేను చాలా గాభరాపడ్డాను. చాలా విషయాలు మాట్లాడే పండితులకు కూడా క్రిటికల్​ కండీషన్​లో మైండ్​ పనిచేయదు. నేను మాత్రం, ఈ వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోలేమా? అని తీక్షణంగా ఆలోచించా. అంతలోనే నిపుణులొచ్చి.. ‘‘సార్​, డేట్​ మార్చుకుందాం, ఇంకోరోజు దాడి చేద్దాం’ అని సూచించారు .

అప్పుడు నా మనసులో కొన్ని విషయాలు గిర్రునతిరిగాయి. ఇప్పుడుగానీ డేట్లు మార్చుకుంటే, అదిగానీ లీకైతే ఇంకెప్పటికీ పాక్​పై దాడి చేయలేం. వ్యక్తిగతంగా సైంటిఫిక్​ విషయాలపై పట్టులేదు. అయినాసరే, మేఘాలు, వర్షం వల్ల మనకే బెనిఫిట్​ జరుగుతుందని ఆఫీసర్లతో చెప్పాను. మేఘాలు అడ్డున్నాయి కాబట్టి పాక్​ రాడార్ల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చని అన్నాను. నా మాటలు విని ఆఫీసర్లు కొంచెం తటపటాయించారు. మేఘాలున్నాయి కదా, మీకేంకాదు ధైర్యంగా బయలుదేరండని ఆదేశించాను. ఫస్ట్​టైమ్​ ఈ విషయాల్ని మీతో పంచుకుంటున్నందుకు మా ఆఫీసర్లు ఏమంటారో చూడాలి”అని మోడీ వివరించారు.

ప్రధాని సిగ్గుపడాలి

‘‘నేషనల్​ సెక్యూరిటీ ఎంత కీలకమైందో తెలిసి కూడా దాని విలువను తగ్గించేలా మోడీ మాట్లాడారు. బాధ్యతారాహిత్య కామెంట్లతో  దేశభద్రతకు డ్యామేజ్​ చేశారు. ఇందుకాయన సిగ్గుపడాలి. ఇలా మాట్లాడే వ్యక్తి ప్రధానిగా ఉండటానికి అనర్హుడు’’

– సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ నేత

సీక్రెట్ బయటపడింది

‘‘మేఘాలు అడ్డుంటే పాకిస్థాన్​ రాడార్లు పనిచేయవన్న సీక్రెట్​ మోడీ మాటలతో బయటపడింది. భవిష్యత్తులో దాడులకు పనికొచ్చే అంశమిది. అన్నట్టు, బీజేపీ ట్వీట్లు ఏమైనట్లు? మేఘాల్లో కలిసిపోయాయా?’’                         – ఒమర్​ అబ్దుల్లా, ఎన్సీ నేత.

భద్రతా బలగాలకు అవమానం

‘‘బాలాకోట్​పై దాడుల్ని ప్రశ్నించినప్పుడు నాపై దెమ్మెత్తిపోశారు. ఇప్పుడు మోడీ చెప్పిన క్లౌడ్​ థియరీ పాకిస్థాన్​ విమర్శనాస్త్రంగా మారింది. మన భద్రతా బలగాలకు ఇంత అవమానం అవసరమా అన్నదే నా బాధ’’              – మెహబూబా ముఫ్తీ, పీడీపీ నేత.