రాజ్ కోట్ (గుజరాత్): మనదేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న గురుకుల విద్యా వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నాటి గురుకులాల్లో నాలెడ్జ్ కు ఎంతో ప్రాధాన్యం ఉండేదన్నారు. విద్యా రంగంలో దేశ ఖ్యాతిని పెంచేలా సాధువులు, ఆధ్యాత్మిక నేతలు, గురువులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. గుజరాత్ లోని రాజ్ కోట్లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ గురుకులానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన అమృత్ మహోత్సవ్ లో ప్రధాని వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) ద్వారా తొలిసారిగా భవిష్యత్తు పట్ల ముందుచూపుతో కూడిన విద్యా వ్యవస్థను సృష్టించామని ప్రధాని చెప్పారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం ఐఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, మెడికల్ కాలేజీల సంఖ్యను దాదాపు 65% పెంచినట్లు తెలిపారు.
గత ప్రభుత్వాలది బానిస మనస్తత్వం..
‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యారంగంలో దేశానికి ఉన్న ప్రాచీన పేరు ప్రఖ్యాతులను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉండేది. కానీ బానిస మనస్తత్వం కారణంగా గత ప్రభుత్వాలు ఈ దిశగా ముందుకు వెళ్లలేదు. కానీ ఎంతో మంది సాధువులు, గురువులు మాత్రం ఈ బాధ్యతను తలకెత్తుకున్నారు. ఇందులో భాగంగానే స్వామినారాయణ్ గురుకులం ఏర్పాటైంది” అని ప్రధాని చెప్పారు. ఇతర దేశాలు సామ్రాజ్యాలు, రాజవంశాల పేర్లతో గుర్తింపు పొందితే.. ఇండియా గురుకులాలతో గుర్తింపు పొందిందన్నారు. నలంద, తక్షశిల వంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేండ్లు అవుతాయని, అప్పటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పౌరులు, యువత పాటుపడాలని మోడీ కోరారు. ఇందులో స్వామినారాయణ్ గురుకులం వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు.
