ఉద్యోగ అవకాశాలను పెంచినం: మోదీ

ఉద్యోగ అవకాశాలను పెంచినం: మోదీ

న్యూఢిల్లీ: సంప్రదాయ రంగాలతోపాటు రిన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్ ఎక్స్‌‌పోర్ట్స్, ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ సెక్టార్లలోనూ ఉద్యోగ అవకాశాలను తమ ప్రభుత్వం పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రోజ్‌‌గార్‌‌‌‌ మేళాలో భాగంగా ఉద్యోగాలు పొందిన 51 వేల మందికి అపాయింట్‌‌మెంట్ లెటర్లు ఇచ్చే కార్యక్రమంలో వర్చువల్‌‌గా ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడమే కాదు.. నియామక ప్రక్రియలో పారదర్శకతను కొనసాగిస్తున్నది. పరీక్షా విధానాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌‌సీ) రిక్రూట్‌‌మెంట్ సమయాన్ని సగానికి తగ్గించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 రీజనల్ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం” అని వివరించారు. రోజ్‌‌గార్ మేళాలో భాగంగా ఇప్పటిదాకా లక్షలాది మంది యువతకు అపాయింట్‌‌మెంట్ లెటర్లు అందజేశామని తెలిపారు.

 అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువతను నైపుణ్యాలు, విద్యతో ఇండియా సిద్ధం చేస్తున్నదని చెప్పారు. ఇండియా వేగంగా పురోగతి సాధిస్తుండటంతో.. అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. ‘‘టూరిజం వృద్ధి చెందడంతో ఉపాధి వనరులు పెరుగుతున్నాయి. ఇప్పుడు క్రీడల్లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తున్నది. మన క్రీడాకారులు గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సంప్రదాయ సెక్టార్లను కేంద్రం బలోపేతం చేస్తున్నది. రిన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్, ఆటోమేషన్, డిఫెన్స్ ఎక్స్‌‌పోర్ట్స్‌‌ వంటి కొత్త సెక్టార్లను కూడా కేంద్రం ప్రమోట్ చేస్తున్నది” అని వివరించారు. ఖాదీ సెక్టార్ తిరిగి ప్రాణం పోసుకుందని, కోల్పోయిన వైభవాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని చెప్పారు. పదేండ్ల కిందట రూ.30 వేలుగా ఉన్న ఖాదీ బిజినెస్.. ప్రస్తుతం రూ.1.25 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయన్నారు.