సాధ్వి ప్రజ్ఞాను ఎన్నటికీ క్షమించం : పీఎం మోడీ

సాధ్వి ప్రజ్ఞాను ఎన్నటికీ క్షమించం : పీఎం మోడీ

గాడ్సే వివాదంలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరువిప్పారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడని కామెంట్ చేసిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై మోడీ సీరియస్ అయ్యారు. మహాత్ముడిని తన మాటలతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ అవమానించారని అన్నారు. సాధ్వి పార్టీని ఇప్పటికే క్షమాపణలు కోరారనీ.. ఐతే.. తాను మాత్రం ఆమెను క్షమించలేనని అన్నారు ప్రధానమంత్రి. జాతీయ మీడియాతో మాట్లాడుతూ… సాధ్వి ఇష్యూపై స్పందించారు ప్రధానమంత్రి.

మాలేగావ్ బ్లాస్ట్ కేసులో నిందితురాలు అయిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ … 2019 లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. బీజేపీ ఆమెను అభ్యర్థిగా నిలబెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు ప్రధానమంత్రి గట్టిగా బలపరిచారు. ఐదువేల ఏళ్లుగా ఉన్న ఓ సంస్కృతిని కొందరు కించపరిచారనీ.. అలాంటి వారికి టికెట్ ఇవ్వడం అంటే.. మన సంస్కృతిని మనం గౌరవించుకోవడమే అంటూ… సాధ్వి అభ్యర్థిత్వానికి గట్టిగా మద్దతు పలికారు. ఐతే.. నాథూరాం గాడ్సే అసలైన దేశభక్తుడంటూ సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన కామెంట్స్ ను మాత్రం పీఎం మోడీ తప్పుపట్టారు. గాంధీని చంపినవాళ్లు ఎన్నటికీ దేశభక్తుడు కాలేడని అన్నారు మోడీ.

నోటీసులు పంపిన అమిత్ షా

గాడ్సే దేశభక్తి వివాదంలో నోరు జారిన కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే , ప్రజ్ఞా ఠాకూర్, కర్ణాటక ఎంపీ నళిన్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పార్టీ చీఫ్ అమిత్ షా ఆదేశించారు. పదిరోజుల్లోగా వీరిపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ సంఘానికి  సూచించారు.