వాయిదా కల్చర్​ను వదిలేద్దాం... న్యాయవ్యవస్థలో ఫ్రొఫెషనలిజాన్ని పెంచుదాం : మోదీ

 వాయిదా కల్చర్​ను వదిలేద్దాం...  న్యాయవ్యవస్థలో ఫ్రొఫెషనలిజాన్ని పెంచుదాం :  మోదీ

 

  •     జ్యుడీషియరీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది 
  •     సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో సీజేఐ ప్రసంగం
  •     చట్టాలను మోడ్రనైజ్ చేస్తున్నమన్న ప్రధాని నరేంద్రే మోదీ

న్యూఢిల్లీ: దేశ న్యాయ వ్యవస్థ కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. క్లిష్టమైన అంశాలపై న్యాయ వ్యవస్థలో చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వాయిదాల కల్చర్ ను వదులుకోవడంతోపాటు దీర్ఘకాలిక సెలవుల సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పెండింగ్ కేసులు, అనవసరమైన పాత పద్ధతుల వంటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థ వాయిదాల కల్చర్ నుంచి ప్రొఫెషనలిజం కల్చర్ వైపుగా మళ్లాలన్నారు. సుప్రీంకోర్టు ఆదివారం 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన ‘డైమండ్ జూబ్లీ ఇయర్’ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. దేశ న్యాయ వ్యవస్థలో మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు న్యాయ వ్యవస్థ అంటే పురుషులకు మాత్రమే సంబంధించిన వృత్తి అనే భావన ఉండేదని.. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళా న్యాయవాదులు, జడ్జిలు 36.3 శాతం ఉన్నారని తెలిపారు.

దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో మహిళలు ఇప్పుడు అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్నారన్నారు. ఏపీ, యూపీ, మహారాష్ట్ర, కర్నాటక సహా అనేక రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జిల నియామకాల్లో ఎంపికైన జడ్జిల్లో 50 శాతానికి పైగా అభ్యర్థులు మహిళలేనని సీజేఐ చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టులో సీనియర్ హోదా పొందిన మహిళా న్యాయవాదుల సంఖ్య రికార్డ్ స్థాయిలో ఉందన్నారు. 2024కు ముందు సుప్రీంకోర్టు 74 ఏండ్ల చరిత్రలో కేవలం 12 మంది మహిళలు మాత్రమే సీనియర్ అడ్వకేట్ హోదాను పొందారని.. కానీ గత ఒక్క వారంలోనే ఏకంగా 11 మంది మహిళలకు సీనియర్ హోదా దక్కిందన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రజలు ఆశ్రయించే ఫస్ట్ పాయింట్ గా జిల్లా కోర్టులు ఉంటాయని, అందుకే అక్కడ జడ్జిలు, అధికారులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఐదు దేశాల చీఫ్ జస్టిస్​లు హాజరు 

ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బంగ్లాదేశ్, భూటాన్, మారిషస్, నేపాల్, శ్రీలంక ప్రధాన న్యాయమూర్తులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, అడ్వకేట్లు, లా స్టూడెంట్లు, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ సి. అగర్ వాలా, తదితరులు హాజరయ్యారు. 

మొదట్లో 28 రోజులే పని దినాలు..  

భారత సుప్రీంకోర్టు 1950, జనవరి 28న ప్రారంభమైంది. మొదట పార్లమెంట్ పాత బిల్డింగ్ లో సుప్రీంకోర్టు కార్యకలాపాలు నడిచాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత బిల్డింగ్ ను 1958, ఆగస్టు 4న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. సుప్రీంకోర్టులో మొదట సీజేఐతో కలిపి 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. ఏడాదికి 28 రోజులు మాత్రమే కోర్టు నడిచేది. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి 34కు పెరిగింది. కోర్టు పని దినాలు ఏడాదికి 190 రోజులకు పెరిగాయి.

రేపటి భారతం మరింత బలోపేతం: మోదీ

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చట్టాలను మోడ్రనైజ్ చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ చట్టాలు రేపటి భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఆదివారం సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ ఉత్సవాళ్లో ప్రధాని ప్రసంగించారు. మూడు కొత్త నేర న్యాయ చట్టాల అమలుతో.. భారతదేశం లీగల్, పోలీసింగ్, దర్యాప్తు వ్యవస్థలు కొత్త శకంలోకి ప్రవేశించాయని అన్నారు. కాగా, ‘సాధికార న్యాయ వ్యవస్థ అనేది ‘వికసిత్ భారత్’లో ఒక భాగం. విశ్వసనీయ న్యాయ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ దిశగా తీసుకొచ్చిన జన్ విశ్వాస్ బిల్లు ఒక ముందడుగు. ఇది భవిష్యత్తులో న్యాయ వ్యవస్థపై పడే భారాన్ని తగ్గిస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు.