ఆక్సిజన్, మందులకు కొరత రావొద్దు.. మోడీ ఆదేశం

 ఆక్సిజన్, మందులకు కొరత రావొద్దు.. మోడీ ఆదేశం
  • ఉత్పత్తి, సప్లైని భారీగా పెంచండి
  • ఉన్నతాధికారులకు ప్రధాని మోడీ ఆదేశం 
  • కరోనా సెకండ్ వేవ్​పై రివ్యూ 
  • రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్​ను అరికట్టాలని ఆదేశం 
  • ఫార్మా రంగాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని సూచన 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెమ్డెసివిర్, ఇతర యాంటీ వైరల్ మందుల బ్లాక్ మార్కెటింగ్, దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. యాంటీ వైరల్ మందుల సప్లై, వినియోగం మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారమే జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్, మందులకు కొరత రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్, రెమ్డెసివిర్, ఇతర మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్ల వంటి అంశాలపై ప్రధాని శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్ కు మించిన ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. త్వరగా టెస్టులు చేయడం, సరిగ్గా ట్రాక్ చేయడం ద్వారానే మరణాలను తగ్గించే అవకాశం ఉందన్నారు. కరోనా ఫస్ట వేవ్ ను దేశం కలిసికట్టుగా జయించిందని, ఇప్పుడు మరింత వేగంగా, కోఆర్డినేషన్ తో మరోసారి కూడా విజయం సాధిస్తామన్నారు.

ఫార్మా ఇండస్ట్రీని పూర్తిగా వాడుకోవాలె 
కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ ల తయారీ కోసం దేశంలోని ఫార్మా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో వాడుకోవాలని ప్రధాని ఆదేశించారు. వ్యాక్సిన్ ల ఉత్పత్తికి పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని అన్ని ఫెసిలిటీలనూ ఉపయోగించుకోవాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో రెమ్డెసివిర్, ఇతర మందుల అవసరం బాగా పెరిగిందని, వాటి ఉత్పత్తిని స్పీడప్ చేయాలన్నారు. దేశవ్యాప్తంగా రెమ్డెసివిర్ అందుబాటులో ఉండేలా తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.

రెమ్డెసివిర్ ఉత్పత్తి పెంచాలె 
జనవరి, ఫిబ్రవరి నాటికి దేశంలో నెలకు 29 లక్షల వయల్స్ రెమ్డెసివిర్ మందు మాత్రమే తయారు అవుతోంది. దీనిని వచ్చే మే నెల నాటికి నెలకు 74.10 లక్షల వయల్స్ వరకూ పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రధాని చెప్పారు. రెమ్డెసివిర్ సప్లై ఏప్రిల్ 11 నాటికి 67,900 వయల్స్ మాత్రమే ఉండగా.. ఏప్రిల్15 నాటికి 2 లక్షల వయల్స్ కు పెరిగిందని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు వివరించారు. 

12 రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ 
కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 12 రాష్ట్రాలకు మందులు, ఆక్సిజన్ ఇతర అవసరాలన్నీ తీర్చేందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 30 వరకూ ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆక్సిజన్ సప్లై ప్లాన్ ను కూడా రూపొందించామని వివరించారు. ఆయా రాష్ట్రాలకు వెంటిలేటర్లు కూడా డిమాండ్ కు తగ్గట్టు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని ఆదేశించారు. వెంటిలేటర్ల వాడకంపై రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేస్కోవాలన్నారు. హాస్పిటల్స్ లో బెడ్ల కొరత లేకుండా చూడాలని, ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడం, సరైన ట్రీట్ మెంట్లు అందించడం పట్ల లోకల్ అధికారులు సానుకూలంగా ఉండాలన్నారు. 

కుంభమేళాను సింబాలిక్​గా జరపండి: మోడీ
హరిద్వార్​లో కొనసాగుతున్న కుంభమేళాను సింబాలిక్ (ప్రతీకాత్మకం)​గా జరపాలని సాధువులను ప్రధాని కోరారు. ‘‘జునా అఖాడాకు చెందిన స్వామి అవధేశానంద్ గిరితో ఫోన్​లో మాట్లాడాను. వైరస్ బారిన పడిన సాధువుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను” అని ట్వీట్ చేశారు. అధికారులకు వారు సహకరించడాన్ని కొనియాడారు. ‘‘రెండు షాహీ స్నానాలు పూర్తయ్యాయి. ఇక కుంభమేళాను సింబాలిక్​గా నిర్వహిస్తే మంచిది. కరోనాతో పోరాటంలో ఇది సాయపడుతుంది” అన్నారు. స్పందించిన అవధేశానంద్.. కుంభమేళాలో స్నానాలకు పెద్ద సంఖ్యలో రావద్దంటూ ప్రజలను కోరారు.

రాష్ట్రాలకు లక్ష ఆక్సిజన్ సిలిండర్లు 
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును స్పీడప్ చేయాలని ప్రధాని ఆదేశించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద ఇప్పటివరకు 32 స్టేట్స్, యూటీల్లో 162 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మొత్తం ఒక లక్ష 
ఆక్సిజన్ సిలిండర్లను సేకరించామని, వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామన్నారు.