సాగు చట్టాల రద్దు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

సాగు చట్టాల రద్దు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
  • రైతులకు లబ్ధి కలిగించేందుకే అగ్రి చట్టాలను తెచ్చినం
  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రద్దు ప్రక్రియ పూర్తి చేస్తం
  • రైతులు ఆందోళనలు విరమించుకోవాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఏడాది కిందట తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నెలాఖరున జరగనున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీ బార్డర్లు సహా ఇతర ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు విరమించుకుని ఇండ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గురు నానక్ జయంతి సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఇది ఎవరినీ నిందించాల్సిన సందర్భం కాదంటూనే.. దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. రైతులకు లబ్ధి కలిగించేందుకే అగ్రి చట్టాలను తీసుకొచ్చామని మరోసారి స్పష్టం చేశారు. రైతులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, మనస్సాక్షితో మూడు చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. చాలా రైతు సంఘాలు, వ్యవసాయ ఎక్స్‌‌పర్టులు, సైంటిస్టులు, ప్రొగ్రెసివ్ ఫార్మర్లు.. వాటిని సమర్థించినట్లు వెల్లడించారు.

ఒప్పించలేకపోయాం..
అగ్రి చట్టాలను రద్దు చేస్తున్నట్లు చెప్పడానికే తాను ప్రజల ముందుకు వచ్చానని ప్రధాని మోడీ అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే రద్దు ప్రాసెస్‌‌ను పూర్తి చేస్తామన్నారు. చట్టాలను అమలు చేసేందుకు స్వచ్ఛమైన మనసుతో ప్రయత్నించినప్పటికీ.. ఒక వర్గం రైతులను తాము కన్విన్స్ చేయలేకపోయామని ప్రధాని అన్నారు. తమ ప్రయత్నాల్లోనే ఏదో లోపం ఉండి ఉండొచ్చని, అందుకే రైతు సోదరులకు నిజాన్ని సరిగ్గా వివరించలేకపోయామని చెప్పారు. 

చిన్న రైతుల కోసమే చట్టాలు తెచ్చినం
చిన్న రైతులను ఎంపవర్ చేసేందుకే తాము మూడు చట్టాలను తీసుకొచ్చామని ప్రధాని మోడీ చెప్పారు. చిన్న రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయ బడ్జెట్‌‌ను 5 రెట్లు పెంచామని, ఏటా 1.25 లక్షల కోట్లకు పైగా ఇందుకోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను తాను చాలా దగ్గరగా గమనించానని, 2014లో ప్రధాని పదవి చేపట్టాక వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని వెల్లడించారు. రైతులు తమ పంటకు సరైన ధర పొందేందుకు, రూరల్ మార్కెట్ ఇన్‌‌‌‌ఫ్రాను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ‘‘మేం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను మాత్రమే పెంచలేదు. రికార్డు స్థాయిలో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. దశాబ్దాల రికార్డులను తిరగరాస్తూ కొనుగోళ్లు చేపట్టాం” అని అన్నారు.

పార్లమెంటు ముందుకు బిల్లు
మూడు అగ్రిచట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం పార్లమెంటు ముందుకు బిల్లును తీసుకురానుంది. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉన్నట్లుగానే.. రద్దు చేయడానికి కూడా అధికారం ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ మాజీ సెక్రటరీ పీకే మల్హోత్రా చెప్పారు. ఇందుకోసం కేంద్రం ఒక ‘రద్దు బిల్లు’ను తీసుకురావాలని, ఇది తప్ప ఇంకో దారి లేదని లోక్‌‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అన్నారు. మూడు చట్టాలపై ఉన్న అభ్యంతరాలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే విషయాలను ప్రభుత్వం వివరించవచ్చని పేర్కొన్నారు.

ఎంఎస్పీపై కమిటీ
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థను మరింత ప్రభావ వంతంగా, పారదర్శకంగా మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. జీరో బడ్జెట్, నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిం చేందుకు సంబంధించిన సలహాల ను కమిటీ నుంచి స్వీకరిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ సైంటిస్టులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు.. కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.

అగ్రి చట్టాల టైమ్‌‌‌‌ లైన్
2020 జూన్ 5: మూడు అగ్రి బిల్లుల గురించి ప్రభుత్వం ప్రకటన
సెప్టెంబర్ 14: చట్టాలపై ఆర్డినెన్స్‌‌‌‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం
సెప్టెంబర్ 17: లోక్‌‌‌‌సభ ఆమోదం
సెప్టెంబర్ 20: వాయిస్ ఓటు ద్వారా రాజ్యసభ ఆమోదం
సెప్టెంబర్ 24: ఆందోళనలు మొదలు.. మూడు రోజుల రైల్ రోకోకు పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు
సెప్టెంబర్ 25: ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేసన్ కమిటీ (ఏఐకేఎస్‌‌‌‌సీసీ) పిలుపుతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగిన రైతులు
సెప్టెంబర్ 26: ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన శిరోమణి అకాళీ దళ్ (ఎస్ఏడీ) 
సెప్టెంబర్ 27: 3 బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి. గెజిట్ జారీ. 
నవంబర్ 25: ‘ఢిల్లీ చలో’ ఉద్యమానికి పంజాబ్, హర్యానాలోని రైతు సంఘాల పిలుపు.
నవంబర్ 26 : హర్యానాలోని అంబాలా జిల్లాలో రణరంగం. రైతులపై వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 
నవంబర్ 28: చర్చలకు పిలిచిన కేంద్ర మంత్రి అమిత్ షా. షరతులు పెట్టడంతో ముందుకు రాని రైతులు.
డిసెంబర్ 3: కేంద్రం, రైతుల మధ్య జరిగిన తొలి రౌండ్ చర్చలు అసంపూర్తిగా ముగింపు.
డిసెంబర్ 5: రెండో రౌండ్‌‌‌‌లోనూ ఏకాభిప్రాయానికి రాని రెండు వర్గాలు. 
డిసెంబర్ 8: భారత్‌‌‌‌ బంద్‌‌‌‌కు రైతుల పిలుపు. 
డిసెంబర్ 9: 3 చట్టాల్లో అవసరమైతే సవరణలు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు.
డిసెంబర్ 11: అగ్రి చట్టాలపై సుప్రీంకోర్టు తలుపుతట్టిన బీకేయూ.
డిసెంబర్ 30: ఆరో రౌండ్, జనవరి 4న ఏడో రౌండ్ చర్చలు అసంపూర్తిగానే ముగింపు.
2021 జనవరి 7: కొత్త చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం.
జనవరి 11: రైతుల నిరసనల విషయంలో సర్కారు తీరుపై సుప్రీం సీరియస్
జనవరి 12: అగ్రి చట్టాల అమలుపై సుప్రీం స్టే. సూచనలు ఇచ్చేందుకు నలుగురితో కమిటీ ఏర్పాటు.
జనవరి 26: ట్రాక్టర్ పరేడ్ చేపట్టిన రైతులు. ఎర్రకోటపైకి ఆందోళనకారులు. విధ్వంసం. ట్రాక్టర్ తిరగబడి ఓ ఆందోళనకారుడి మృతి.
జనవరి 29: ఏడాదిన్నరపాటు అగ్రి చట్టాల అమలును నిలిపేస్తామని చెప్పిన కేంద్రం. అంగీకరించని రైతులు. 
ఫిబ్రవరి 5: ‘టూల్ కిట్’ క్రియేట్ చేసిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబర్ క్రైమ్ సెల్.
ఫిబ్రవరి 6: దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా చక్కా జామ్ చేపట్టిన రైతులు. 
మార్చి 6: రైతుల నిరసనలకు 100 రోజులు.
మే 27: తమ నిరసనలకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించిన రైతులు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం. 
జూన్ 5: అగ్రి బిల్లులపై ప్రభుత్వ ప్రకటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంపూర్ణ కాంత్రికారి దివాస్ పాటించిన రైతులు.
జూన్ 26: ఢిల్లీకి ర్యాలీ చేపట్టిన రైతులు.
జులై 22: వర్షాకాల సమావేశాలకు సమాంతరంగా ‘కిసాన్ సన్సాద్’ను పార్లమెంట్ హౌస్ దగ్గర నిర్వహించిన 200 మంది రైతులు.
ఆగస్టు 7: 14 ప్రతిపక్ష పార్టీల సమావేశం. కిసాన్ సన్సాద్‌‌‌‌కు హాజరుకావాలని నిర్ణయం.
అక్టోబర్ 22: రోడ్లను నిరవధికంగా బ్లాక్ చేయడం ఏంటని రైతులపై సుప్రీంకోర్టు సీరియస్.
అక్టోబర్ 29: ఘాజీపూర్ బార్డర్‌‌‌‌‌‌‌‌లో అడ్డుగా ఉంచిన బారికేడ్ల తొలగింపును ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు.
నవంబర్ 19: అగ్రి చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన.