స్వాతంత్ర్య పోరాటంలో వారూ రక్తం చిందించారు: మోదీ
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ట్రైబల్స్ ను నిర్లక్ష్యం చేశారు
2014లో మేమొచ్చాకే బిర్సా ముండాను గౌరవించాం
‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ వేడుకల్లో ప్రధాని స్పీచ్
డేడియాపాఢా/సూరత్: దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది గిరిజనులు కూడా రక్తం చిందించారని, కానీ వారి త్యాగాలను కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో ఎన్నడూ గుర్తించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే క్రెడిట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గిరిజనుల త్యాగాలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు.
శనివారం జన్ జాతీయ గౌరవ్ దివస్, ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా గుజరాత్‌లోని డేడియాపాఢా టౌన్లో జరిగిన వేడుకల్లో ప్రధాని మాట్లాడారు. ‘దేశ గౌరవం, ఆత్మాభిమానం, స్వాతంత్ర్యానికి ఎప్పుడు సవాల్ ఎదురైనా.. మన గిరిజనులు ముందుండి పోరాడారు. మన స్వాతంత్ర్య పోరాటమే గొప్ప ఉదాహరణ’ అని చెప్పారు.
జార్ఖండ్‌కు చెందిన బిర్సా ముండాతోపాటు గుజరాత్‌కు చెందిన గోవింద్ గురు, రూప్ సింగ్ నాయక్, మోతీలాల్ తేజావత్ వంటి ఎంతోమంది వీరులు మడమతిప్పని పోరాటం చేశారని కొనియాడారు.
‘‘2014కు ముందటి వరకూ భగవాన్ బిర్సా ముండాను సైతం ఎవరూ గుర్తుచేసుకోలేదు. ఇప్పుడు బిర్సా ముండా కుటుంబసభ్యులు కూడా ఈ వేదికపై ఉన్నారు. మన గిరిజన సోదరసోదరీమణులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకునేందుకు జన్ జాతీయ గౌరవ్ దివస్ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది” అని మోదీ తెలిపారు.
గిరిజన శాఖనూ నిర్లక్ష్యం చేశారు..
దేశాన్ని ఆరు దశాబ్దాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ గిరిజనులను పూర్తిగా విస్మరించిందని ప్రధాని ఫైర్ అయ్యారు. గిరిజనులు కనీస సౌలతులకూ నోచుకోలేక అవస్థలు పడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోయాయన్నారు. ‘‘గిరిజనుల అభివృద్ధికి బీజేపీ సర్కారు టాప్ ప్రయారిటీ ఇస్తోంది. వారికి జరిగిన ఈ అన్యాయానికి ముగింపు పలకాలని మేం నిర్ణయించాం” అని చెప్పారు.
గిరిజనులకు సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రూ. 18 వేల కోట్లతో మోడల్ ట్రైబల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. కాగా, జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా రూ. 9,700 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు నర్మద జిల్లాలోని దేవ్ మోగ్రా గ్రామంలో పండోరీ మాతా ఆలయంలో మోదీ పూజలు చేశారు.
బిహార్ ప్రజలు కులతత్వ విషాన్ని తిరస్కరించారు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి వ్యాప్తిచేసిన కులతత్వ, మతతత్వ విషాలను ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ అన్నారు. ఇందిర, రాజీవ్ గాంధీతో పనిచేసిన కాంగ్రెస్ జాతీయ నేతలు సైతం నామ్ దార్(రాహుల్ గాంధీని ఉద్దేశించి) చర్యలతో చింతిస్తున్నారని చెప్పారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం నేపథ్యంలో సూరత్‌లో ఉంటున్న బిహార్ వాసులు మోదీని సత్కరించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘దేశం ఆల్రెడీ ఈ ‘ముస్లిం లీగ్–మావోయిస్ట్ కాంగ్రెస్’ ను తిరస్కరించింది. ఇప్పుడు పార్టీని కాపాడటం కష్టమని కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన పార్టీ ఈ స్థితికి దిగజారడంపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ వారు ఈవీఎంలు, ఈసీపై నిందలు వేస్తున్నారు. దీనిని ఆ పార్టీ కార్యకర్తలే ఎక్కువకాలం అంగీకరించరు” అని అన్నారు.
