కాంగ్రెస్​పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నరు : మోదీ ట్వీట్​

కాంగ్రెస్​పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నరు  : మోదీ ట్వీట్​

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ కుటుంబ పాలన, ప్రతికూల రాజకీయాలపై ప్రజలు కోపంతో ఉన్నారని, బీజేపీపై విశ్వాసం చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో బుధవారం ప్రచారం చివరి రోజు సందర్భంగా మోదీ, అభివృద్ధి కోసం బీజేపీని ఆశీర్వదించాలని ఓ ట్వీట్​లో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్​లో డబుల్​ ఇంజన్​అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు.  

మధ్యప్రదేశ్​ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా బీజేపీ ప్రభుత్వం మాత్రమే మార్చగలదని ప్రజల్లో విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బహిరంగ సభల్లో తనకు ఆ విషయం ప్రత్యక్షంగా తెలిసిందని అన్నారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌లోని మహిళా ఓటర్లు బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారని, బీజేపీ వారి సాధికారత కోసం కృషి చేస్తోందని ప్రధాని వివరించారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కొత్త తరం వారి రాబోయే 25 ఏండ్లను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని మోదీ తెలిపారు.

 చత్తీస్​గఢ్​లో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడనుంది. ప్రజలు బీజేపీ సుపరిపాలనను నమ్ముతున్నారు తప్ప, కాంగ్రెస్‌‌‌‌ బూటకపు వాగ్దానాలను నమ్మడం లేదు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను’ అని మోదీ చెప్పారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్‌‌‌‌కు విజన్‌‌‌‌ కానీ, రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ కానీ లేదన్నారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ను అవినీతి, దుష్పరిపాలన నుంచి బయటపడేయడం బీజేపీతో మాత్రమే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ యువత మార్పునకు కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని మోదీ అన్నారు.

పీఎం కిసాన్ ​నిధుల విడుదల

జార్ఖండ్​ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బుధవారం కుంతీ జిల్లాలో జన జాతీయ గౌరవ్​ దివస్​ను పురస్కరించుకొని పీఎం కిసాన్​ పథకం 15వ విడత రూ.18 వేల కోట్లను విడుదల చేశారు. ఒక బటన్‌‌‌‌ను క్లిక్ చేయడం ద్వారా 8 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేల చొప్పున డబ్బును బదిలీ చేశారు. 

చత్తీస్‌‌‌‌గఢ్, మధ్యప్రదేశ్‌‌‌‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు డబ్బు విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఉద్దేశపూర్వకంగానే కిసాన్​  నిధులను ఆలస్యంగా విడుదల చేసి ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో జమ చేశారా? అని కాంగ్రెస్​ సీనియర్ ​నేత జైరామ్ రమేశ్​ ట్విట్టర్​లో ప్రశ్నించారు.