
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లయిన సందర్భంగా మంగళవారం ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో వరుసగా ట్వీట్లు చేశారు. నాడు ఎమర్జెన్సీ విధించినోళ్లకు, నేడు రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదంటూ మోదీ మండిపడ్డారు.
‘‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరులు, ధీరవనితలకు నివాళులర్పించే రోజు ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రజల స్వేచ్ఛను ఎలా హరించిందో? రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కిందో? నాటి చీకటి రోజులు గుర్తు చేస్తాయి. కేవలం అధికారం కాపాడుకోవడం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది.
ఎదురించినోళ్లను హింసించింది. బడుగు, బలహీనవర్గాలు లక్ష్యంగా దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చింది” అని ఫైర్ అయ్యారు. ‘‘ఎమర్జెన్సీ విధించినోళ్లకు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు. వీళ్లే ఆనాడు పత్రికా స్వేచ్ఛను హరించారు. ఫెడరలిజాన్ని నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు. ఆ మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగంపై తమకున్న అయిష్టాన్ని దాచిపెట్టి, పైకి నాటకాలు ఆడుతున్నారు. కానీ ప్రజలు వాళ్ల ప్రవర్తనను అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్లను పదేపదే తిరస్కరిస్తున్నారు” అని అన్నారు.
మీది అప్రకటిత ఎమర్జెన్సీ: ఖర్గే
మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందు కు గతాన్ని తవ్వుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీజేపీ పదేండ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేశారని విమర్శించారు. ‘‘మోదీజీ.. దేశం భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నది. కానీ మీరు మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడా నికి గతాన్ని తవ్వుతున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ అంటే ఎట్లుంటదో గత పదేండ్లలో ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.
ఈ అప్రకటిత ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం దెబ్బతిన్నాయి” అని ట్వీట్ చేశారు. ‘‘పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం.. ఈడీ, సీబీఐ, ఐటీలను దుర్వినియోగం చేయడం, సీఎంలను జైల్లో పెట్టడం, ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం.. ఇవన్నీ అప్రకటిత ఎమర్జెన్సీ కాదా?” అని ఖర్గే ప్రశ్నించారు.