టెర్రరిజాన్ని ఉపేక్షించొద్దు: ప్రధాని మోదీ

టెర్రరిజాన్ని ఉపేక్షించొద్దు: ప్రధాని మోదీ

టెర్రరిజాన్ని ఉపేక్షించొద్దు

అది ఎంత పెద్ద సవాలో ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతోంది: మోదీ  

న్యూఢిల్లీ :  టెర్రరిజం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని.. అది మానవత్వానికి వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టెర్రరిజం ఎంత పెద్ద సవాలు అనేది ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో జీ20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమిట్ ను ప్రారంభించిన అనంతరం  మోదీ మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజంతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతున్నప్పటికీ, టెర్రరిజం నిర్వచనంపై ఇప్పటివరకు ఏకాభిప్రాయం రాకపోవడం శోచనీయమన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

 20 ఏండ్ల కింద మన పార్లమెంట్ పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. ‘‘ఇండియాకు క్రాస్ బార్డర్ టెర్రరిజం సవాలుగా మారింది. దీనివల్ల ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో ఏ మూలన ఘర్షణలు జరిగినా అవి అందరిపై ప్రభావం చూపిస్తాయి. ఆ ఘర్షణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇది శాంతి, సోదరభావంతో ముందుకెళ్లాల్సిన సమయం. మానవ అవసరాలు తీర్చే లక్ష్యంతో అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు. అలాగే ‘‘ఈవీఎంల వినియోగంతో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరిగింది. ఎన్నికలు జరిగిన గంటల్లోనే రిజల్ట్స్ వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న జనరల్ ఎలక్షన్లలో 100 కోట్ల మంది ఓటు వేయనున్నారు. అది చూసేందుకు మీరందరూ మళ్లీ ఇండియాకు రావాలి” అని జీ20 ప్రతినిధులను మోదీ ఆహ్వానించారు.