
ఆత్మనిర్భర్ స్కీంతో దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలను సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం రాష్ట్రీయ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. నూతనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఉద్యోగ అవకాశాల కల్పనకు ఆత్మనిర్భర్ స్కీం దారితీస్తున్నదన్నారు. ఒక నివేదిక ప్రకారం, స్టార్టప్‌లు ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని తెలిపారు మోడీ.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 70,000 మందికి పైగా యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ప్రధాని వెల్లడించారు. ఎన్డీయే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని చెప్పారాయన. నిన్న మధ్యప్రదేశ్ లో 22,000 మంది ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చారని మోడీ పేర్కొన్నారు.