
- ప్రాణభయంతో దాక్కున్నారు. మోడీ ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు
- నేనూ పేదరికంలోనే పుట్టి పెరిగా
- నాది వెనకబడిన కులం కావొచ్చు..
- దేశాన్ని ముందుకు నడిపించడమే లక్ష్యం
- దమ్ముంటే నాపై ఆరోపణలు రుజువు చేయండి
- ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ సవాల్
దేశ రక్షణ విషయంలో, మాతృభూమి గౌరవాన్ని కాపాడడంలో ఈ ఐదేళ్లలో ఎక్కడా రాజీ పడలేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దీంతో పాకిస్థాన్‌కు, అక్కడి టెర్రరిస్టులకు కంటిమీద కునుకే లేకుండా పోయిందన్నారు. వీర సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో టెర్రరిస్టులకు భయం మొదలైందన్నారు. ప్రాణభయంతో అండర్‌గ్రౌండ్‌లో దాక్కొని మోడీ ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నారన్నారు. ‘పేదరికం, వెనకబాటుతనం ఎంత బాధాకరమో నాకు తెలుసు. స్వయంగా నేను కూడా అనుభవించా. వెనుకబడిన కులంలో పుట్టి ఉండొచ్చు కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. మీ ఇబ్బందులను తొలగించేందుకు నేనున్నా. మీరే నాకుటుంబం. మీతోనే ఉంటా, మీతోపాటే కష్టపడతా. ఈ పరిస్థితిని మార్చేయడంలో మనం సక్సెస్అవుతామనే నమ్మకం నాకుంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బలియా, బీహార్‌లోని బక్సార్, ససారాంలలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. తనపై ఆరోపణలను నిరూపించాలంటూ ఎస్పీ,బీఎస్పీ కూటమికి బహిరంగ సవాల్‌విసిరారు. ‘నన్ను తిట్టడం కాదు మీ ఆరోపణలను రుజువు చేయండి. బినామీ ఆస్తులు పోగేసుకున్నానా, బంగ్లాలు, ఫాంహౌజ్‌లు కట్టుకున్నానా, విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నానా?’ చూపించాలని నిలదీశారు. ధనవంతుడిని కావాలని కలలు కనలేదని, ప్రజల సొమ్మును లూటీ చేయలేదని చెప్పారు. పేదల సంక్షేమం కోసమే ప్రతీక్షణం ఆలోచించామన్నారు.
కుల, మతాలతో రాజకీయం
లోకల్గుండాలనే అదుపు చేయలేని నేతలు టెర్రరిస్టులను ఎలా డీల్చేయగలరంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచమంతా టెర్రర్దాడులతో హడలిపోతున్న ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఉండాలని మోడీ చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై విమర్శలు గుప్పిస్తూ.. కుల, మత రాజకీయాలు చేస్తూ వాళ్లు మీ సొమ్మును లూటీ చేశారన్నారు. వారసత్వ, అవినీతి రాజకీయాలపై విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని మోడీ అన్నారు.
దేశాన్ని చీకట్లోకి నెడతారు
కాంగ్రెస్, ఆర్జేడీ లకు ఓటేసి గెలిపిస్తే రెండూ కలిసి దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తాయని ప్రధాని మోడీ ఆరోపించారు. దేశాన్ని ముందుకు నడిపించాలని తాము ప్రయత్నిస్తుంటే, ఎలా వెనకకు తీసుకెళదామా అని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని చెప్పారు. ఎస్పీ,బీఎస్పీ కూటమికి అధికారం అప్పగిస్తే.. రాళ్లు విసిరేవారికి, నక్సలైట్లకు, గ్యాంగులకు లైసెన్సులిస్తారని ప్రధాని మోడీ విమర్శించారు.
కాశీతో విడదీయలేని బంధం నాది
‘వారణాసిలో అడుగుపెట్టిన ఎవరికైనా ఈ సిటీతో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. గత ఐదేళ్లలో చాలాసార్లు వచ్చిన నాకు కూడా అదే బంధం ఏర్పడింది. నేనూ కాశీ వాసినే. ఈ నగరమే నన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తోంది. లోక్‌సభకు మార్గం చూపింది. ఈ ఐదేళ్లలో నగరాన్ని అభివృద్ధి మార్గంలోకి మళ్లించా.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. మరోసారి సభలో అడుగుపెట్టేలా ఆశీర్వదించండి. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలతో వారణాసి రూపురేఖలను మార్చేస్తా’ అంటూ రికార్డెడ్ వీడియో సందేశంలో మోడీ కాశీ వాసులకు విజ్ఞప్తి చేశారు.