
అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వేలాది మంది మురికివాడల ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఢిల్లీలోని కల్కాజీలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రధాని మోడీ ఇండ్లను పంపిణీ చేశారు. స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కింద స్లమ్ క్లస్టర్ల నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 3024 ప్లాట్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడంతో లబ్ధిదారులకు మోడీ ప్లాట్లను అందజేశారు.
ఫేజ్ వన్ కింద మొత్తం రూ.345 కోట్ల నిధులతో ఈ ప్లాట్లను నిర్మించారు. అర్హులైన వారికి ఇంటి తాళం అందజేసినప్పుడు వారి ముఖంలో కనిపించిన సంతోషం వెలకట్టలేనిదని మోడీ వ్యాఖ్యానించారు. కేవలం ఒక్క కల్కాజీ స్లమ్ ఏరియాలోనే 3 వేలకుపైగా ప్లాట్లను నిర్మించామన్నారు. పట్టణాల్లో నివసించే పేదల అభ్యున్నతిపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు.