
మెదక్, వెలుగు: రైతులు పలుచోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా పంటల సాగుకు అవసరమైన వివిధ రకాల సేవలన్నీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎరువుల రిటైల్షాప్లను దశలవారీగా వన్ స్టాఫ్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించింది. వాటికి ‘పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు’ అనే పేరు పెట్టింది. దేశ వ్యాప్తంగా మొత్తం 600 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ జిల్లాకు సంబంధించి పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట పట్టణం, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కేంద్రాన్ని బుదేరా చౌరాస్తాలో ఏర్పాటు చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగే అగ్రి స్టార్టప్ సెమినార్, ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రారంభిస్తారు.
ఏమేం సేవలు అందుతాయంటే..
పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే భూసార పరీక్ష సేవలు అందుతాయి. వ్యవసాయరంగంలో వచ్చే మార్పులు, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, కొత్త వంగడాలు, ఆధునిక విధానాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు చూసేందుకు, ప్రతి రెండో శనివారం ప్రసారమయ్యే ‘కిసాన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా టీవీ ఏర్పాటు చేశారు. ఎరువుల సరఫరా కోసం ఒక పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఒక ఎరువుల కంపెనీకి అప్పగించారు.