
- తిరుమల తరహాలో డెవలప్ మెంట్
- రేపు శ్రీశైలానికి రానున్న ప్రధాని మోదీ
- భారీ బందోబస్తు ఏర్పాట్లలో పోలీసులు
- గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వాహనాల రాకపోకలు బంద్
మహబూబ్‌నగర్/శ్రీశైలం, వెలుగు: వారణాసి కాశీ విశ్వనాథ్కారిడార్, ఉజ్జయిని మహాకాళ్ కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్‌ను డెవలప్ చేయడానికి ఏపీ ప్రభుత్వం రూ.1,657 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. గురువారం శ్రీశైలానికి ప్రధాని మోదీ వస్తుండగా శ్రీశైలం అభివృద్ధి ప్రపోజల్స్ ను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్అందించనున్నారు.
ప్రపోజల్స్ ఇవి..
శ్రీశైల క్షేత్రం డెవలప్మెంట్కు రూ.1,657 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇందులో రూ.90 కోట్లతో కొత్త క్యూ కాంప్లెక్స్, రూ.65 కోట్లతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాలు మండపాల నిర్మాణం, రూ.25 కోట్లతో ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, రూ.25 కోట్లతో కైలాస కళాక్షేత్రం, రూ.13 కోట్లతో కొత్త ప్రసాదాల తయారీ పోటు నిర్మాణం, రూ.10 కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం, రూ.5 కోట్లతో దేవస్థానం వర్క్ షాప్ నుంచి రుద్ర పార్కు వరకు బ్రిడ్జి నిర్మాణం, రూ.95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించారు. టైగర్ రిజర్వు పరిధిలో దేవస్థానం ఉండడంతో అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. అవసరమైన భూమిని మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
2010లోనే మాస్టర్ ప్లాన్ తయారు
2010లో రూ.600 కోట్లతో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించగా, రూ.200 కోట్ల పనులు చేశారు. అయితే.. శ్రీశైలం ముఖద్వారం నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు ‘వీరభద్ర జంక్షన్’ ఫోన్ లేన్ల రోడ్డు విస్తరణ ప్రతిపాదన ఉన్నా, పట్టాలెక్కలేదు. తాజా మాస్టర్‌ప్లాన్‌లో దీన్ని చేపట్టేందుకు నిధులు కోరనున్నారు. శ్రీశైలాన్ని తిరుమల తరహాలో, సున్నిపెంటను తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలని 2016లో నిర్ణయించారు.
శ్రీశైలంలోని ఇండ్లను సున్నిపెంటకు తరలించి శ్రీశైలం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కేంద్రం సాయం తీసుకొని మళ్లీ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలం--సున్నిపెంట మధ్య ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండగా.. వంతెన నిర్మిస్తే 2.5 కిలోమీటర్ల దూరమే అవుతుంది. వంతెన పనులకు రూ.20 కోట్ల నిధులకు మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదించనున్నారు.
ప్రధాని షెడ్యూల్ ఇలా..
శ్రీశైలం పర్యటనకు గురువారం ప్రధాని మోదీ షెడ్యూల్‌ఖరారైంది. ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఉదయం 10.20 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
హెలికాప్టర్ లో సున్నిపెంటకు 11.10 గంటలకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని, ఉదయం 11.45 కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట నుంచి నన్నూరుకు హెలికాప్టర్ లో వెళ్లి మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్‌హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4.15 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకొని, 4.40 కు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకొని, ఢిల్లీకి వెళ్తారు.
రాకపోకలు బంద్
ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేయనున్నారు. హైదరాబాద్ వైపు ప్రయాణించే భక్తులు, దోర్నాల ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు తమ పర్యటన సమయాలను మార్చుకోవాలని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ పోలీసుల సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని ఆమె సూచించారు.
శ్రీశైలంలో భారీ బందోబస్తు
శ్రీశైల క్షేత్రంలో రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నల్లమల అడవుల్లో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ సిబ్బంది కూంబింగ్నిర్వహిస్తున్నారు. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్త భద్రత కల్పించే ప్రదేశాలు, సేఫ్ హౌస్ ప్రాంతాలను పరిశీలించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్,ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఉన్నారు.