మేం పాటిస్తున్నాం.. మ‌రి మీరు?: కేబినెట్ భేటీ ఫొటో ట్వీట్…

మేం పాటిస్తున్నాం.. మ‌రి మీరు?: కేబినెట్ భేటీ ఫొటో ట్వీట్…

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హమ్మారి జ‌బ్బు క‌రోనా. కంటికి క‌నిపించ‌కుండా వేగంగా వ్యాప్తి చెందుతున్న అంటువ్యాధి ఇది. ఈ వైర‌స్ సోకిన వాళ్లు తుమ్మినా, ద‌గ్గినా ఆ తుంప‌ర్ల ద్వారా ప‌క్క వారు కూడా వ్యాధి బారిన‌ప‌డుతారు. దీనికి ప్ర‌స్తుతం ఎటువంటి వ్యాక్సిన్ లేదు. ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌కుండా నివారించ‌డ‌మే మార్గం. దీనిని ముందే అక్కుకునేందుకు ఉన్న మందు ఒక్క‌టే సోష‌ల్ డిస్టెన్సింగ్. అంటే సామాజికంగా ఒక‌రి నుంచి ఒక‌రు దూరంగా ఉండ‌డం. మ‌నిషికీ మ‌నిషికీ మ‌ధ్య క‌నీసం మీట‌రు దూరం పాటించ‌డం ద్వారా క‌రోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చు. ఇందుకోస‌మే దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిన్న రాత్రి ప్ర‌క‌టించారు. ఎవ‌రూ ఇంటిని దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇంటి ముందు ల‌క్ష్మ‌ణ రేఖ గీసుకుని లోప‌లే ఉండాల‌ని సూచించారు. దీని ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తికి చెక్ పెట్టొచ్చ‌ని, మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చిన చెప్పారాయ‌న‌.

కేబినెట్ భేటీలో ఆచ‌ర‌ణ

సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించాల‌ని పిలుపునిచ్చిన ప్ర‌ధాని మోడీ అది వ్యాధి ఉన్న వాళ్ల‌కు మాత్ర‌మే అనుకోవ‌ద్ద‌ని, త‌నతో స‌హా దేశంలో ప్ర‌తి సామాన్య పౌరుడు దీన్ని పాటించాల‌ని సూచించారు. వైర‌స్ సోకినా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డానికి 14 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుండ‌డంతో ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన వారిని గుర్తించి చికిత్స చేయ‌డంతో పాటు ఇత‌రుల‌కు వ్యాపించకుండా ఉండేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఇవాళ మ‌ధ్యాహ్నం జ‌రిగిన‌ కేంద్ర కేబినెట్ బేటీలో ఈ సోష‌ల్ డిస్టెన్సింగ్ ను ఆచ‌ర‌ణ‌లో చూపారు. సాధార‌ణంగా ఎప్పుడూ మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఒకే బ‌ల్ల‌పై అంద‌రూ వ‌రుస‌గా కూర్చోవ‌డం చూస్తుంటాం. ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ తో ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర మంత్రులు, ఇత‌ర అధికారులు క‌నీసం మీట‌రు దూరంతో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో సోష‌ల్ డిస్టెన్స్ అనేది ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల్సిన అవ‌స‌రం ఉందంటూ కేబినెట్ భేటీ ఫొటోను త‌న ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. సోష‌ల్ డిస్టెన్సింగ్ మేము పాటిస్తున్నాం.. మ‌రి మీరూ? అంటూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారాయ‌న‌.