ఎల్లుండి వరంగల్ కు మోదీ... రూ. 6,100 కోట్ల పనులకు శంకుస్థాపన

ఎల్లుండి వరంగల్ కు మోదీ... రూ. 6,100 కోట్ల పనులకు శంకుస్థాపన

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రానికి రానున్నారు. వరంగల్​లో రూ. 6,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) బుధవారం అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ఈ నెల 7న చత్తీస్​గఢ్​, ఉత్తరప్రదేశ్​లో, 8న తెలంగాణ, రాజస్థాన్​లో ఆయన పర్యటిస్తారని పేర్కొంది. వరంగల్ పర్యటనలో భాగంగా రూ. 500 కోట్లతో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌‌‌‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ. 5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఇందులో నాగ్‌‌‌‌పూర్–-విజయవాడ కారిడార్‌‌‌‌లోని 108 కిలోమీటర్ల మేర మంచిర్యాల–వరంగల్ సెక్షన్ లో ఈ ప్రాజెక్ట్​లు ఉన్నాయి.

 ఈ సెక్షన్​లో మంచిర్యాల–-వరంగల్ మధ్య దాదాపు 34 కి.మీల దూరం తగ్గనుంది. తద్వారా ఎన్​హెచ్44, ఎన్​హెచ్-65లో ట్రాఫిక్‌‌‌‌, ప్రయాణ సమయం తగ్గనుంది. అలాగే ఎన్​హెచ్ 563లోని 68 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్–-వరంగల్ రెండు లేన్‌‌‌‌ల రహదారిని నాలుగు లేన్​ల ఆప్ గ్రేడేషన్  పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్–-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్ పార్క్, వరంగల్‌‌‌‌లోని సెజ్‌‌‌‌లకు కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ రూట్ దోహదపడనుందని పీఎంవో వెల్లడించింది.