ఇండియాలో పుట్టిన చెస్‌ ప్రపంచాన్ని మెప్పించింది

ఇండియాలో పుట్టిన చెస్‌ ప్రపంచాన్ని మెప్పించింది
  • మన ఆట జగమంతటా
  •  ఇండియాలో పుట్టిన చెస్‌ ప్రపంచాన్ని మెప్పించింది: మోడీ

న్యూఢిల్లీ: ఇండియాలో పుట్టిన చెస్‌ ప్రపంచం మొత్తాన్ని మెప్పించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  అన్నారు. చెస్‌కు జగమంతటా ఇంత ఆదరణ దక్కినందుకు దేశ ప్రజలంతా గర్వపడాలని అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌ తరహాలో చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన టార్చ్‌ రిలేను మోడీ ఆదివారం ఢిల్లీలోని ఐజీ స్టేడియంలో  ప్రారంభించారు. బ్యాటన్‌ను చెస్‌ లెజెండ్‌, ఇండియా తొలి గ్రాండ్‌ మాస్టర్ విశ్వనాథన్‌ ఆనంద్‌కు అందించారు. తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపితో కాసేపు చెస్‌ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  చెస్‌ ఒలింపియాడ్‌లో మొట్టమొదటి టార్చ్‌ రిలే ఇండియా నుంచి ప్రారంభం అవడం, ఒలింపియాడ్‌కు మనదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.

‘చెస్‌  ఇప్పుడు తన పుట్టిన గడ్డపైకి తిరిగి వచ్చింది. చెస్‌ ఒలింపియాడ్‌ రూపంలో దాని విజయాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ టార్చ్ రిలే ఇండియా నుంచే ప్రారంభం కావాలని ఫిడే నిర్ణయించింది. ఇది ఇండియాకే కాదు చెస్‌ ఆటకు దక్కిన గౌరవం. ఇండియా  ఫిట్‌నెస్‌ కోసం కుస్తీ, కబడ్డీ ఆడేవారు. మేధస్సు పెంచుకునేందుకు  మన పూర్వీకులు చెస్‌ను కనుగొన్నారు. అలాంటి ఆట ఈ ప్రపంచం మొత్తం విస్తరించి ఎంతో ఆదరణ పొందింది. ఈ ఆటలో విజయం సాధించాలంటే యోగా, ధ్యానం కీలకం. చెస్ ఆటలోని మరో గొప్ప లక్షణం దూరదృష్టి. షార్ట్‌ కట్స్‌ కంటే దూరదృష్టితోనే నిజమైన విజయం లభిస్తుందని చెస్ చెబుతుంది’ అని మోడీ పేర్కొన్నారు.

ఇక, ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇండియా గవర్నమెంట్‌కు  ఫిడే ప్రెసిడెంట్ డ్వొరోవిచ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో   కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆలిండియా చెస్‌ సంఘం అధికారులు, ఒలింపియాడ్​కు ఎంపికైన డే ఇండియా ప్లేయర్లు పాల్గొన్నారు. 

40 రోజులు.. 75 నగరాలు

ఇండియా మొదటిసారి ఆతిథ్యం ఇస్తున్న చెస్‌ ఒలింపియాడ్‌కు ముందు రిలే నిర్వహించాలని ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెడరేషన్‌ (ఫిడే) నిర్ణయించింది. ఇకపై ప్రతీ ఒలింపియాడ్‌కు ముందు రిలేను ఇండియాలోనే ప్రారంభించి, టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశానికి చేర్చనుంది. ఈసారి సమయం తక్కువగా ఉండటంతో కేవలం ఇండియాలోనే రిలే జరపనున్నారు. ఢిల్లీలో మొదలైన రిలే 40 రోజుల్లో లేహ్‌, శ్రీనగర్‌, ముంబై, హైదరాబాద్‌ సహా 75 నగరాల్లో ప్రయాణించి జులై 28–-ఆగస్టు 10 మధ్య ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చే చెన్నై మహాబలిపురానికి చేరుకుంటుంది.