ఈజిప్టు అధ్యక్షుడితో మోడీ ద్వైపాక్షిక చర్చలు

ఈజిప్టు అధ్యక్షుడితో మోడీ ద్వైపాక్షిక చర్చలు

భారత  74వ గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసితో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ డొమైన్‌, వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ సంబంధాలు మరింత పెరుగుతున్నాయని,  ప్రాచీన, సాంస్కృతిక, ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు ఎంతో సహకరిస్తాయని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఓ ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానం పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.