తెలంగాణ ఆదాయన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోంది : రాహుల్ గాంధీ

 తెలంగాణ ఆదాయన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోంది  :  రాహుల్ గాంధీ

తెలంగాణ ఆదాయన్ని సీఎం కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని  ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.   ల్యాండ్‌, సాండ్‌, మైన్స్‌, వైన్స్‌ అంతా కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉందన్నారు.  సంగారెడ్డి జిల్లా అందోల్ లో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్ మాట్లాడారు.  ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న రాహుల్‌..  కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.  

కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోందన్నారు రాహుల్ గాంధీ.  కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.  బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనన్నారు.   లోక్‌సభలో మోదీకి బీఆర్‌ఎస్‌, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ మద్దతిస్తారని చెప్పారు.  ప్రధాని మోదీ తనపై 24కేసులు పెట్టారన్న రాహుల్..  అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదన్నారు.  రాష్ట్రంలో కేసీఆర్‌ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని విమర్శించారు.  

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని,  ఆరు గ్యారెంటీలను అమలుచేస్తుందని హామీ ఇచ్చారు.   తొలి కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడతామన్నారు.   పదేళ్లుగా కేసీఆర్  దోచుకున్న అవినీతి సొమ్మును కాంగ్రెస్ సర్కార్ వసూలు చేస్తుందన్నారు.  ఆ  అవినీతి సొమ్మంతా ప్రజల ఖాతాల్లో జమచేస్తామన్నారు.