అమ్మాయి పెండ్లి 18కా..21కా..?

అమ్మాయి పెండ్లి 18కా..21కా..?

ఇంట్ల ఆడపిల్ల ఉంటే ఏదో బరువు మోస్తున్నట్టు బాధపడుతుంటరు కొందరు పేరెంట్స్‌. కూతురికి ఎప్పుడు పద్దెనిమిదేండ్లు నిండుతయా.. ఎప్పుడు లగ్గం చేసి, ఇంట్ల నుంచి పంపించేద్దామా అని చూస్తుంటరు. ఇంకొందరేమో ‘మా బిడ్డ ఇంకా సదవాలె. మంచి నౌకరీ రావాలె. తన కాళ్ల మీద తను నిలబడ్డంకనే పెండ్లి చేస్తం’ అంటరు. వీళ్లలో ఎవరు కరెక్ట్‌? లగ్గం ఏ వయసుల చెయ్యాలె?  పద్దెనిమిదేండ్లకే పెండ్లి చేసి, చేతులు దులుపుకోవాల్నా? సర్కార్‌‌ ప్రపోజ్‌ చేస్తున్నట్టు 21 ఏండ్లు వచ్చేవరకు ఆగాల్నా?

అమ్మాయిలకు 21 ఏండ్ల తర్వాతనే పెండ్లి చేయాలనే చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇండిపెండెన్స్‌ డే స్పీచ్‌లో చెప్పిన విషయం దేశమంతా చర్చకు దారి తీసింది. చట్టం చేయడం పెద్ద పనేమి కాదని, అయితే అందరూ దాన్ని పాటిస్తారా లేదా అనేది సమస్య అని ఎనలిస్టులు అంటున్నారు. ‘గొప్పింటి సంబంధం. అబ్బాయి మంచోడు. చదువు, ఉద్యోగం ఉన్నాయి’ అంటూ నాన్న తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా, అమ్మాయిలు తలవంచి తాళి కట్టించుకున్నట్టే.. చట్టం​ చెప్పినట్టు పేరెంట్స్ చేస్తారా? పెద్దలు చెప్పిన సంబంధాలను కాదని నచ్చినవాడితో లేచిపోయినట్టుగా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తారా? అప్పుడు కుటుంబం వెలివేసినట్టే చట్టం శిక్షిస్తుందా?


అబ్బాయి పుడితే బాగా చదివించాలని అమ్మానాన్న కలలు కంటారు. పుట్టిన బిడ్డ నడకవముందే వాడిని డాక్టరో, ఇంజనీరో చేయాలనే గోల్స్‌ పెట్టుకుంటారు. అమ్మాయి పుడితే ఆలోచనలు, ఆశలు అలా ఉండవు. డాక్టరుకో, ఇంజినీరుకో ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటారు. ఆ డాక్టరు గారి భార్య, ఇంజినీర్​ గారి మిసెస్​ అనిపించుకోవాలంటే కొంత చదువుండాలని చదివిస్తారు. అన్ని ఇళ్లలో ఇదే పరిస్థితి లేకపోయినా మెజారిటీ మెదళ్లలో ఉండే ఆలోచన ఇదే. కాదని వాదిస్తే.. 21ఏళ్లకు ముందే 32 శాతం మంది అమ్మాయిలు మెట్టినింటికి చేరుతున్నారని నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే సమాధానం చెబుతుంది. అంటే అమ్మాయి చదువుకు మధ్యలోనే పుల్​స్టాప్​ పడిందనేగా?

పెళ్లా? చదువా?

‘గుడ్డు ముందా? కోడి ముందా?’ అన్నట్టు ఉంటుంది.. అమ్మాయి చదువు ఆగిపోవడానికి, తొందరగా పెండ్లి కావడానికి జరిగే చర్చ! పెండ్లి కాబట్టే చదువు ఆగిపోయిందని కొందరు, చదువు ఆగిపోబట్టే పెళ్లి చేస్తున్నారని ఇంకొందరు అంటారు. అమ్మాయి చదవాలని అందరూ కోరుకుంటున్నారు. ఒకప్పుడు పదేళ్లు నిండకముందు నుంచే పెండ్లిళ్లు జరిగేవి. పాతికేళ్లు కూడా రాకముందే విడోస్​ అయినవాళ్లు కూడా కనిపించేది. అలాంటి పెండ్లిళ్లలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలకు పదమూడు, పద్నాలుగేళ్ల వయసు వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి. ఈ మార్పుతోపాటే బాల్య వివాహాల సంఖ్య కూడా ఏటా తగ్గుతోంది. ‘చట్టాలు చేస్తేనే ఈ మార్పు రాలేదు. చట్టాలతోపాటు చదువుకునే అవకాశాలు కూడా పెరిగాయి. కాబట్టే ఆడపిల్లల జీవితాలు మారాయి. ఆడపిల్లలకు ఎక్కడైతే చదువుకునే అవకాశాలు పెరగుతూ వచ్చాయో అక్కడ చిన్న వయసు వివాహాలు తగ్గుతున్నాయి. ఎక్కడ చదువుకునే అవకాశాలు పెరగలేదో అక్కడ ఇంకా పసి వయసులోనే లగ్గాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలను పూర్తిగా తగ్గించాలంటే ఏం చేయాలి? ఎక్కడ అలాంటి వివాహాలు తగ్గుతున్నాయో అక్కడ కనిపించే మార్పుని అన్నిచోట్లా తీసుకురావాలి.

పేదింటిలోనే చిన్నారి పెళ్లి

‘చదువుకుంటే బాగా బతుకుతావురా’ అనే పేరెంట్స్​ బాగా బతుకుతుందనే ఆశతో చదువుకునే ఆడపిల్లకు పెళ్లి చేస్తారు. ఈ వివాహాలు ఒకప్పుడు కొన్ని కులాల్లో ఎక్కువగా జరిగేవి. యాదవ, వడ్డెర, లంబాడీ లాంటి కులాలు, దళిత ఆదివాసుల్లో ఇలాంటి వివాహాలు చాలా ఎక్కువ. రిజర్వేషన్లు, అభివృద్ధి, చైతన్యంతో ఇప్పుడా కులాల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు జరిగే చిన్న పిల్లల పెండ్లిళ్లన్నీ కులాన్ని బట్టి కాకుండా పేదరికం వల్లనే జరుగుతున్నాయి. ఈ రెంటినీ లేకుండా చేయాలంటే కనీస వివాహ వయసు పెంచడంతోపాటు పేదలు చదువుకునే అవకాశాలు పెంచితే చాలు. ఆడపిల్లలందరూ బడికి, కాలేజీకి పోయేటట్టు చేస్తే.. ఆడపిల్లలు అమ్మానాన్నకు భారం కారు.

ఆకలిబాధలు తీరినట్టే

అబ్బాయి కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు. అమ్మాయి కనీస పెళ్లి వయసు 18 సంవత్సరాలు. ఈ చట్టం ప్రకారం అబ్బాయికి 21 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తే ఏ సమస్యా లేదు. అప్పటికల్లా అబ్బాయి డిగ్రీ పూర్తవుతుంది.

బాల్యం అంటే?

యునిసెఫ్, డబ్ల్యూహెచ్​ఓ 18 సంవత్సరాలలోపు వయసుని బాల్యంగా పరిగణిస్తున్నాయి. ప్రపంచంలోని 190కిపైగా దేశాలతోపాటే మన దేశం కూడా ఇందులో సభ్య దేశం. ఈ సంస్థల రూల్స్‌ అన్నీ మన దేశంలో కూడా పాటించాల్సిందే. అయితే బాల్యాన్ని సూచించే వయసుని మన ప్రభుత్వం ఒక్కో చట్టంలో ఒక్కో రకంగా ఫిక్స్‌ చేసింది. జువైనల్ పనిష్​మెంట్​కి ఒకప్పుడు 18 ఏళ్ల వయసు అమలులో ఉంటే నిర్భయ ఘటన తర్వాత 16 ఏళ్లకు తగ్గించారు. బాలకార్మిక నిర్మూలనా చట్టంలో 14 ఏళ్ల వయసులోపు వాళ్లను పనిలో పెట్టకూడదు.14 ఏళ్లు పైబడిన పిల్లలు ప్రమాదకరం కాని పనుల్లో వేతనానికి పని చేయవచ్చని ఆ చట్టం అనుమతిస్తుంది. చైల్డ్​ మ్యారేజ్​ ప్రివెన్షన్​ చట్టం 18 ఏళ్ల వయసుని లెక్కలోకి తీసుకుంటుంది. కానీ, 18 ఏళ్లు దాటిన మగపిల్లల పెళ్లి మీద ఆంక్షలున్నాయి. వాళ్లకు 21 ఏళ్లను పెళ్లి వయసుగా నిర్ణయించారు.

ఆ బాధలు ఇంకెవరికీ రావొద్దు

నాకు 16 ఏళ్లకు పెళ్లి చేశారు. అప్పటికి టెన్త్​ క్లాస్​ అయిపోయింది. చదవాలని కోరిక. కాలేజీకి వెళ్లనివ్వలేదు. నాది మా ఆడబిడ్డ పిల్లల వయసు. వాళ్లు చదువుకుంటున్నారు. నేను ఇంట్లో పని చేస్తున్నాను. నా ఇంట్రస్ట్ గుర్తించి మా ఆడపడుచు చదివించమన్నది. అలా ఇంటర్​ చదువు మొదలైంది. తర్వాత టీటీసీలో సీటు వచ్చింది. పొద్దునే ఇంటి పనులన్నీ చేసి, కాలేజీకి పోయివచ్చేది. అందరికీ సేవలు చేస్తూ చదువుకున్నాను. అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నర పాప, నెలల బాబు ఉన్నారు. అత్తగారు నీ పిల్లల్ని ఎందుకు చూడాలన్నది. మా అమ్మకు పిల్లల్ని అప్పగించి టీటీసీ పూర్తి చేశాను. ఆ రోజు అలా చదివాను కాబట్టే నేను టీచర్‌ అవ్వగలిగాను, నా బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వగలిగాను. మా అమ్మాయి ఇంటర్​ చదువుతున్నప్పటి నుంచే పెండ్లి సంబంధాలు వచ్చేవి.

అందంగా ఉందని, నాకు, మా ఆయనకు గవర్నమెంట్ జాబ్స్‌ ఉన్నాయని వచ్చేవాళ్లు. కానీ మేం ఇప్పట్లో పెండ్లి చేయబోమని చెప్పాం. డబ్బున్న సంబంధాలు, డాక్టర్​ సంబంధాలు కూడా కాదన్నాం. మా అమ్మాయికి చదువే ముఖ్యం అన్నాను. మంచిగా చదివించాను. అమెరికాలో జాబ్ చేస్తోంది. నా బిడ్డను ఎలా చూసుకున్నానో నా స్టూడెంట్స్​ని కూడా అలాగే చూసిన. మా స్టూడెంట్స్​ పేదింటి బిడ్డలు. ఎప్పుడైనా పెండ్లి తప్పదని ఇంట్లో అంటున్నారని పిల్లలు చెబితే మీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. ఆత్మ విశ్వాసం ఉండాలి. మా కాళ్ల మీద మేం నిలబడతామని పేరెంట్స్​తో చెప్పాలని చెప్పాను. మ్యారేజ్​ ఏజ్​ పెంచాల్సిన అవసరం ఉంది. ఆడ పిల్లలు 21 ఏళ్లనాటికి మానసికంగా ఎదిగి ఉంటారు. జీవితంలోని ఒడిదుడుకులు కూడా తెలిసి ఉంటారు.

 – ఉరిమళ్ల సునంద (టీచర్​), ఖమ్మం