వారసత్వాన్ని కాపాడుకోని దేశం.. భవిష్యత్తునూ కోల్పోతది

వారసత్వాన్ని కాపాడుకోని దేశం.. భవిష్యత్తునూ కోల్పోతది
  • వారసత్వ సంపద రక్షణను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు: మోదీ 
  •  ఎన్నికల కోసం కాదు.. దేశం కోసమే అభివృద్ధి పనులు 
  • కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశాం 
  • గుజరాత్​లో రూ. లక్ష కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన పీఎం 

అహ్మదాబాద్/పోఖ్రాన్ : దేశ వారసత్వ సంపదను కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వాన్ని రక్షించుకోని దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుందని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం గుజరాత్ లోని సబర్మతిలో రూ. 1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ ప్లాన్ ను మోదీ ఆవిష్కరించారు. దీనితోపాటు మొత్తం రూ.1,06,000 కోట్ల డెవలప్ మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో 10 వందే భారత్ ట్రెయిన్​లతో సహా రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే రూ.20,600 కోట్లతో భరూచ్ జిల్లా దహెజ్ వద్ద నిర్మించిన పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్​ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబర్మతి వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బాపూజీ సబర్మతి ఆశ్రమం దేశానికే కాకుండా సమస్త మానవాళికీ వారసత్వ సంపద. ఈ ఆశ్రమం మన దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని చాటి చెప్పే యాత్రాస్థలిగానే కాకుండా.. వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన ఇండియా)ను చూపే ప్రదేశం కూడా. నేడు బాపూజీ విజన్ మన దేశానికి అద్భుతమైన భవిష్యత్తు దిశగా మార్గం చూపుతోంది” అని మోదీ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలకు దేశ వారసత్వాన్ని కాపాడాలన్న  ఆలోచనే లేకపోయిందన్నారు. విదేశీ కోణం నుంచి భారత్​ను చూడటం, బుజ్జగింపు రాజకీయాలతోనే ఆ ప్రభుత్వాలు కొనసాగాయని.. దీంతో వారసత్వ సంపద ఆక్రమణలకు, అపరిశుభ్రతకు, విధ్వంసానికి గురయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

గుజరాత్​లో 9 లక్షల మంది ప్రకృతి సేద్యం.. 

గాంధీజీ గ్రామ స్వరాజ్యం భావన ఆధారంగానే తాము వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను చేపట్టామని మోదీ తెలిపారు. గుజరాత్ లో 9 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, వీరంతా కలిపి ఏటా 3 లక్షల టన్నుల యూరియాను ఆదా చేస్తున్నారని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనన్నారు. దేశంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న కోటి మంది మహిళలు ఇప్పటికే లక్షాధికారులు (లఖ్ పతి దీదీలు)గా మారారని ప్రధాని వెల్లడించారు. కేంద్రం చేపట్టిన చర్యలతో దేశంలో పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. 

ఈ అభివృద్ధి పనులు దేశం కోసమే.. 

దేశవ్యాప్తంగా తన ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక అభివృద్ధి పనులు ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చేయడంలేదని ప్రధాని తెలిపారు. దేశ నిర్మాణం కోసమే ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పాత తరాల వాళ్ల మాదిరిగా నేటి తరం యువత కష్టాలు పడకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. సబర్మతి సమీపంలో నిర్మించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్ సీ) ఆపరేషన్ కంట్రోల్ సెంటర్​ను ఆయన సందర్శించారు. గత పదేండ్లలో రైల్వే శాఖలో అభివృద్ధి పనులకు ఖర్చును ఆరు రెట్లు పెంచామని చెప్పారు. గత రెండు నెలల్లోనే రూ.11 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు. తాము రైల్వే బడ్జెట్​ను కేంద్ర బడ్జెట్​లో విలీనం చేయడం వల్లే.. కేంద్రం నిధులను రైల్వేల్లో ఖర్చు చేసేందుకు వీలు కలుగుతోందన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ 650 కి.మీ. పొడవు ఉంటుందని, దీనివల్ల ప్యాసింజర్, గూడ్స్ ట్రెయిన్ సర్వీసులు స్పీడప్ అవుతాయన్నారు. ఫలితంగా వ్యవసాయం, వాణిజ్యం, ఎగుమతుల వంటి వాటికి ఊతం లభిస్తుందన్నారు.

పోఖ్రాన్ సాక్షిగా సత్తా చాటిన ‘శక్తి త్రయం’  

భారత శక్తి త్రయం(ఆత్మనిర్భరత, విశ్వాసం, ఆత్మగౌరవం)కు పోఖ్రాన్ సాక్షిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ‘భారత్ శక్తి’ పేరిట  త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ప్రధాని తిలకించారు. భారత్ శక్తి ఎక్సర్ సైజ్ లో భాగంగా 50 నిమిషాల పాటు తేజస్ విమానాలు, అర్జున్ యుద్ధట్యాంకులు, కే9 వజ్ర, ధనుష్, షరంగ్ ఆర్టిలరీ గన్స్, పినాక రాకెట్ సిస్టమ్, ఇతర ఆయుధాలతో నిర్వహించిన యుద్ధ విన్యాసాలు మన దేశ మిలిటరీ సత్తాను చాటేలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. పోఖ్రాన్ ఇప్పుడు స్వయంసమృద్ధి, విశ్వాసం, ఆత్మగౌరవం అనే మూడు శక్తులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు.