
- అన్ని క్లాసుల్లో డిజిటల్ బోధన
- కంప్యూటర్ ల్యాబ్ ల్లో ప్రత్యేక తరగతులు
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు, విద్యార్థులకు మెరుగైన విద్య బోధన అందించేందుకు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) చేపట్టగా అందులో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్కూల్ ను అత్యుత్తమైన వాటిగా ఎంపిక చేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద దేశవ్యాప్తంగా పలు పాఠశాలలను ఎంపిక చేసి రెండు సంవత్సరాలుగా వాటి ప్రగతిని పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా జిల్లాకు ఒక్క అత్యుత్తమమైన పాఠశాలను ఎంపిక చేసింది.
మెదక్ జిల్లా నుంచి కూచన్ పల్లి హైస్కూల్ ఎంపిక
హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 2024లో పీఎంశ్రీ కింద ఎంపికైంది. ఈ స్కూల్లో 456 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.9.98 లక్షలు మంజూరయ్యాయి. పీఎంశ్రీ గైడ్‌లైన్స్ ప్రకారం కిచెన్ గార్డెన్, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. మొక్కలు నాటి పచ్చదనం పెంచారు. ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ఇక్రిశాట్‌కు, రామప్ప దేవాలయానికి తీసుకెళ్లారు. విద్యుత్ ఆదా చేసేందుకు స్కూల్ లో ట్యూబ్ లైట్స్ తొలగించి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం స్టూడెంట్స్‌కు యోగా శిక్షణ ఇస్తున్నారు.
వర్గల్ జడ్పీహెచ్‌ఎస్
సిద్దిపేట జిల్లాలో వర్గల్ జడ్పీహెచ్‌ఎస్ అత్యున్నతమైన స్కూల్‌గా ఎంపికైంది. ఈ స్కూల్లో 465 మంది విద్యార్థులున్నారు. స్కూల్‌లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు, అదనపు తరగతి గదులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను విజయవంతంగా అమలు చేశారు. ఒకేషనల్ కోర్సుల నిర్వహణ, స్కూల్ మెయింటెనెన్స్, సైన్స్, మాథ్స్ సర్కిల్స్, ఎక్స్పోజర్ విజిట్స్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్, సెల్ఫ్ డిఫెన్స్, పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కల్చరల్ స్పోర్ట్స్ యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ ను ప్రభుత్వ సూచనల మేరకు నిర్వహిస్తున్నారు. కాగా వర్గల్ జడ్పీహెచ్ఎస్ కు అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి రూ. 40.30 లక్షలు మంజూరైనట్టు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించారు.
తెల్లాపూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో..
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎంపికైంది. ఈ స్కూల్లో 560 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. పాఠశాల ఆవరణ మొత్తం గ్రీన్ స్కూల్ గా మార్చి స్వచ్ఛతలో ముందు వరుసలో నిలిచారు. కంప్యూటర్స్ ద్వారా స్టూడెంట్స్ కు చదువు చెబుతున్నారు. అన్ని క్లాస్ రూముల్లో డిజిటల్ తరగతి బోధన చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి వర్ని కంపోస్ట్ తయారీ, వర్షపు నీరు వృథా కాకుండా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. హర్యానా సంస్కృతిని తెలుసుకొని అక్కడి భాషను నేర్చుకున్నారు.