
దుబ్బాక, వెలుగు: దుబ్బాక ప్రజలు గర్వపడేలా పోచమ్మ తల్లి ఆలయాన్ని తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్రావు పిలుపు నిచ్చారు. ఆదివారం దుబ్బాకలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి అన్ని కులాల ఆరాధ్య దైవమని, ప్రతి పండుగకు తల్లి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు పైసా ఇవ్వడం లేదని, ఆలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. దుబ్బాక జేఏసీ ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్, మల్లన్న సాగర్ ఉప కాల్వల కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దామని పిలుపు నిచ్చారు.
అవసరమైతే నియోజకవర్గ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిద్దామని ప్రకటించారు. మల్లన్న సాగర్ ఉప కాల్వల నిర్మాణం, కూడవెళ్లి వాగులోకి మల్లన్న సాగర్ నీటిని రైతుల కోసం విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశానని, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ రఘునందన్రావు తెలిపారు.