వెలుగు ఓపెన్ పేజీ.. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బండి సంజయ్.. కొన్ని ప్రశ్నలు

వెలుగు ఓపెన్ పేజీ.. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బండి సంజయ్.. కొన్ని ప్రశ్నలు

బండి సంజయ్​కుమార్​ కేంద్ర కేబినెట్​లో జూనియర్​ మంత్రి అదీ హోంశాఖలోనే.  ఆయన కొడుకు బండి  భగీరథ్​ పోక్సో  కేసు దాదాపు 10 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని, కొంతమేరకు  దేశాన్ని కుదిపేసింది.  అయితే ఈ మొత్తం కేసు  హైదరాబాద్​లోని పేట్​బషీర్ బాద్ పోలీస్​స్టేషన్​లో  నమోదైన  మే 8వ తారీకు నుంచి అతను  మే 16న అరెస్టు అయినంతవరకు ఒక డ్రామాలా నడిచింది.  పోక్సో యాక్ట్ కేసు అంటే 18 ఏండ్లలోపు ఉన్న అమ్మాయిపైగాని,  అబ్బాయిపైగాని  లైంగిక దాడి జరిగితే  లైంగిక దాడి చేసిన వ్యక్తులకు మినిమమ్ 20 ఏండ్లు జైలు శిక్ష ఉంటుంది. ఈ పోక్సో చట్టాన్ని కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు 2012లో పార్లమెంటు ఆమోదించింది. 

ఈ చట్టాన్ని నిర్భయ కేసు ఢిల్లీలో జరగకముందే సోనియా గాంధీ ఇనీషియేటివ్​తో  తెచ్చారు.  ఇటువంటి చట్టం ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలో ఉండగా తెచ్చేవారా లేదా చెప్పలేం. ఈ చట్టం స్త్రీ జీవనరక్షణకు సంబంధించింది. ఈ చట్టం కింద ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వంలోని ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇరుక్కుంటాడని ఆ రెండు నిర్మాణాల నాయకత్వం ఊహించి ఉండదు. ఈ చట్టం కింద ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇరుక్కున్నప్పుడు ఎటువంటి మొరాలిటీని కేంద్ర ప్రభుత్వం, దాన్ని నడిపే ఆర్ఎస్ఎస్ పాటించాల్సి ఉండాల్సింది అనేది ఇప్పుడు కీలక అంశం. 

కేంద్ర మంత్రి ఈ కేసు తన దృష్టికి వచ్చిన మొదటిరోజు నుంచి తన కొడుకు అరెస్టు అయ్యేవరకు కేవలం బండి సంజయ్​ వ్యక్తిగా వ్యవహరించినట్లు భావించడానికి వీలులేదు.  ఆయనపైన అమిత్​షా అదే డిపార్టుమెంటు చూసుకునే మినిస్టర్​ ఉన్నాడు.  ఆపైన ప్రధానమంత్రి ఉన్నాడు. అంతేకాక పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. వీళ్లు ఆయన్ని ఏం చేయాలో గైడ్​ చేయలేదు అనుకోవడానికి లేదు. 

ఈ కేంద్ర పాలన యంత్రాంగమేకాక ఆర్ఎస్ఎస్ మొత్తం యంత్రాంగాన్ని గైడ్​చేసే సంస్థ. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్  గొప్పతనం గురించి అమెరికాలో  ప్రచారం చేయడానికి  వెళ్లిన దాని పెద్ద నాయకులు దత్తాత్రేయ హోసబలె,  రాంమాధవ్​లు మా అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయదు అని స్పష్టంగా చెప్పారు. అక్కడి విలేకర్లు మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రశ్నలడిగినప్పుడు వాళ్లు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ కేసు ఒక హోంమంత్రి  కొడుకు మానవ హక్కుల ఉల్లంఘనలో.. అదీ ఒక మైనర్​ బాలిక జీవించే హక్కు, ఆత్మగౌరవ హక్కుకు సంబంధించిన కేసు. ఈ కేసు మొదలైనప్పటినుంచి  అమిత్​షాగాని, మోదీగానీ ఏం మాట్లాడకుండా ఉండడం చాలా పెద్ద సమస్య.  అది రాజకీయ సమస్యే కాదు. మొరాలిటీ సమస్య.

ఆర్ఎస్ఎస్ సైలెన్సు అంతకన్నా పెద్ద సమస్య

ప్రతి రాష్ట్రంలో  దాని  రాష్ట్రస్థాయి శాఖ  దాని రాజకీయ వింగ్​ను  శాసిస్తుంటుందని ఆ సంస్థను పరిశీలిస్తున్న వారికి తెలుసు.  సంజయ్​కుమార్​ శాఖ సభ్యుడిగా ఎదిగిన వ్యక్తి.  అతి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆర్ఎస్ఎస్ శాఖల్లో  చేర్పించి ట్రైనింగ్​ ఇస్తుంది. బండి బగీరథ్​ కూడా శాఖ సభ్యుడేనా, కాదా?  ఆర్​ఎస్ఎస్ చెప్పాలి కదా! ఇతర రాజకీయ పార్టీలకు వాటిని అండర్​గ్రౌండ్​ నుంచి నడిపే మరో సంస్థ ఉండదు. కానీ బీజేపీ అట్లాకాదు. దానిలో ప్రధాన నాయకులుగా ఉన్నవాళ్లు  రెండు సభ్యత్వాలు కలిగి ఉంటారు. ఈ రెండు సభ్యత్వాల విషయంలోనే 1979లో జనసంఘ్​ మురార్జీదేశాయ్​ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పుడు కూడా ఆ నిబంధనలతోటే బీజేపీ ప్రభుత్వంలో ఒక నాయకుడు మంత్రి కాగలుగుతాడు. 

బండి సంజయ్​ అలా ఉన్న వ్యక్తే.  కనుక ఆ సంస్థ ఇంత తీవ్రమైన విషయంలో  దాని గైడెన్స్​ ఉండకుండా ఎలా ఉంటుంది?  మే 8 నుంచి 16 వరకు ఆర్ఎస్ఎస్  తెలంగాణ లేదా నాగపూర్​ నాయకత్వం సంజయ్​ పోలీసులకు భగీరథ్​ను  దొరకనివ్వకు,  ముందస్తు  బెయిల్​ పిటిషన్​ వేసి చాలా ఖర్చుతో  కూడుకున్నా బాగా డబ్బు తీసుకునే లాయర్లనుపెట్టి అరెస్టును ఆపేయాలనే సలహా ఇచ్చారా  లేదా? అసలు ఈ మొత్తం కేసును  ఒక  సమస్యగా చూడలేదా?  ఈ  సమస్య ఇంతదూరం రాకముందే  మైనర్​ బాలిక తల్లిదండ్రులు మంత్రిని కలిశారట.  అప్పుడు కూడా ఆయన ఈ కేసును పెద్ద లెక్క చేయదగిందికాదని,  వారితో  అమర్యాదగా వ్యవహరించి  వెళ్లగొట్టాడని  ప్రచారం ఉంది. తల్లి ఉత్తరం అది నిజమని చెప్పింది. 

ఒక దేశ హోంమంత్రి ఆ దశ నుంచి,  భగీరథ్​  దొరకకుండా చూసి,  ఖరీదైన లాయర్లను దింపి ముందస్తు బెయిల్​కోసం ట్రై చేయడం లీగల్​గా సాధ్యమవ్వవచ్చు కాని మోరల్​గా అది ఎలా  ఆర్ఎస్ఎస్​కు,  కేంద్ర  హోంశాఖకు అంగీకరించదగ్గదైంది? ఇది జాతిని రక్షించాలనుకునే జాతీయవాద సిద్ధాంతంలో ఎలా ఇముడుతుంది?

పోక్సో కేసు కేవలం లీగల్ ​సమస్య కాదు

ఈ చట్టం ఈ దేశ భవిష్యత్ పౌరుల అన్ని సంస్థల్లో, అన్ని పార్టీల్లో, అన్ని వర్గాల్లో జీవించే మనుషులు ముఖ్యంగా పురుషుల మోరల్​ స్థితిని నిర్ధారించేది. ఈ కేసులో భగీరథ్​ మూల బాధ్యుడు.  సంజయ్​ కాదు నిజమే.  కానీ సంజయ్​ కేవలం  సాధారణ తండ్రి కాదు. అతనొక ప్రపంచంలోనే అతిపెద్ద  జాతీయవాద నీతివంతమైన సంస్థ సభ్యుడు.     కేంద్రాన్ని, వివిధ రాష్ట్రాలను పరిపాలించే పాలకులు దాని గొప్పతనం గురించి ప్రతినిత్యం చెబుతున్న సంస్థ. 
అంతేకాక లీగల్​ సిస్టమ్​ దేశస్థాయిలో చట్టబద్ధతతో, మోరల్​ విలువలలో  నడుపవలసిన మినిస్టర్​ కొడుకు భగీరథ్​. అతని కేసు ఇది. ఈ స్థితిలో ఆర్ఎస్ఎస్,  కేంద్ర హోంశాఖ బండి సంజయ్​కు ఇవ్వాల్సిన  అతి ముఖ్యమైన సలహా ఏమిటి?  భగీరథ్​ను  వెంటనే అరెస్టు కానివ్వడం.  తరువాత ప్రతి పౌరుడిలా బెయిలుకు,  ట్రయల్​లో జరిగే  ప్రక్రియకు తమ శక్తికొద్దీ  ప్రయత్నం చేసుకుని నిర్దోషిగా బయటపడడం లేదా  శిక్ష అనుభవించడం. బండి సంజయ్​కు ఆర్ఎస్ఎస్, కేంద్ర హోం మినిస్ట్రీ  ఈ విలువల్ని మనం పాటించాల్సిన అవసరం లేదని చెప్పాయా! ఈ కేసు విషయంలో  ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్ర హోంమినిస్ట్రీ నుంచి ఈ  ప్రశ్నకు  ప్రధానంగా  క్లారిటీ కావాలి. సైలెన్సు వాళ్లు మాట్లాడే జాతీయవాదంతో  పొసగదు.

సంజయ్​ను ఉంచుతారా, తీసేస్తారా?

ఈ ప్రశ్నకు సమాధానం నేను పైన చర్చించిన ఆర్ఎస్ఎస్,  బీజేపీ మోరల్​ విలువలపై ఆధారపడుతుంది. ఆయన ఈ విధంగా వ్యవహరించి, కేంద్ర హోం మంత్రిగా  విషయం తనకు తెలిసినప్పటి నుంచి నేను ఈ వ్యాసం రాసేవరకు ఉపయోగించి కొడుకును కాపాడాలని చూశాడు. ఇప్పుడు  సంజయ్​ రాజీనామా చేసినా  లేదా ప్రధానమంత్రి  రాష్ట్రపతి ద్వారా ఆయనను తొలగించినా పైన పేర్కొన్న మోరల్​ ప్రశ్నలకు పై నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఇటువంటి ప్రశ్నలకు మేం సమాధానం చెప్పేది లేదు. మేం చేయదల్చుకున్నది చేస్తాం అంటే ఈ దేశ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. ప్రతి ఆధునిక దేశంలో స్త్రీ–పురుష సంబంధాల మధ్య నీతిని నిలబెట్టడం ప్రజాస్వామ్యానికి కూడా ప్రామాణికం అవుతుంది. 

అమెరికా మాజీ ప్రెసిడెంట్​ బిల్​ క్లింటన్​  తన ఆఫీసులోని ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అంశంపై ఆయన ఇంపీచ్​మెంట్​ను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశానికి  స్త్రీజాతికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అటువంటి దేశాలను కూడా మంచి  విలువలు లేని  క్రైస్తవ దేశాలని దూషించే ఆర్ఎస్ఎస్  బండి సంజయ్​ను, ఆయన కొడుకును వెనుకేసుకొస్తే  ప్రపంచమంతా నవ్వుతుంది. ఆర్ఎస్ఎస్  మాకు సంబంధం లేదన్నా నమ్మరు.  కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి చిన్న అపాయింటుమెంటును మానిటర్​చేసే సంస్థ ఈ సమస్యతో మాకు సంబంధం లేదని ఎలా అంటుంది? చర్చ జరగాల్సింది ఈ అంశంపైనకాని  కేవలం బండి సంజయ్​  పదవిపైన మాత్రమే కాదు. 

అమిత్​షా, మోదీ ఏం చేశారు?

ఇది ఒక లంచం కేసు కాదు. దొంగతనం కేసు కాదు.  జాతి స్త్రీ–పురుష సంబంధాలను ఒక బలమైన నీతి అనే దారంపై నిలబెట్టి నడిపించే అంశం. ఈ అంశంలో  కేంద్రాన్ని  మేమే నడిపిస్తున్నామని  అమెరికా వంటి  దేశంలో చెప్పిన ఆర్ఎస్ఎస్  మాకు దానితో సంబంధం లేదని చెప్పడానికి కూడా లేదు. ఆ సంస్థ  ద్వంద్వ సభ్యత్వం లేకుండా ఏ వ్యక్తి  కేంద్రంలో కాని, రాష్ట్రాల్లో మంత్రులుగా  ఉండనివ్వదు. ఇది ఒకనాడు వాజ్​పేయి, అద్వానీలు అంగీకరించిన విషయమే. 

ఇది  పొలిటికల్​  మొరాలిటీ  సమస్య కాదు.  సామాజిక,  స్త్రీ–పురుష  జీవన మొరాలిటీకి సంబంధించింది.  ఇటువంటి  కేసులో పరస్పర అంగీకారం, తరువాత వివిధ కారణాల వల్ల తిరస్కారంతో  కూడా  సంబంధం లేదు. అటువంటి ప్రశ్నలన్నీ ఇద్దరి మేజర్ల మధ్య కేసులో వేయవచ్చు.  ఈ  మైనర్​  అమ్మాయి విషయంలో అటువంటి ప్రశ్న వేయడానికి ఆర్ఎస్ఎస్​కు కూడా ఆస్కారం  లేదు.  ఈ  కేసులో  భగీరథ్​  భంగపరిచిన అమ్మాయి మేజరా,  మైనరా అనేది ముందస్తు  బెయిలు  సందర్భంగా  తేలే సమస్య కూడా  కాదు. అది  దేశ హోంమంత్రికే  తెలవకపోతే ఎలా!  పోనీ ఆయన పుత్రవాత్సల్యంలో ఆ దారి పట్టాడనుకుందాం. అమిత్ షా ఏం చేశాడు? మోదీ ఏం చేశాడు?   మోహన్​  భగవత్​ ఏం చేశాడు?

 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.