పోడు పట్టాల పంపిణీ వ్యవహారంలో అనుమానాలు

పోడు పట్టాల పంపిణీ వ్యవహారంలో అనుమానాలు
  • పోడు పట్టాల వెనుక మూడేండ్ల కిందే రెడీ అయినా పంపిణీ చేయని ఆఫీసర్లు
  • లబ్ధిదారుల ఆందోళనతో దిగివచ్చిన ఆఫీసర్లు
  • రూ.లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు 
  • రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు 


ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండలంలో పోడు పట్టాల పంపిణీ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. దాదాపు మూడేళ్ల నుంచి తహసీల్దార్​ ఆఫీస్​లో ఉన్న పట్టా పుస్తకాలను, గత వారం లబ్ధిదారులకు ఆఫీసర్లు అందజేశారు. ఇటీవల తహసీల్దార్​ఆఫీస్​ ముందు లబ్ధిదారులు ఆందోళన చేసి నిరసన తెలపడంతో ఆఫీసర్లు స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి గుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారుల ఇండ్లకే పట్టాలను పంపించారు. అయితే  ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని అంటున్నారు. పెండింగ్ లో ఉన్న పట్టాలను ఇప్పిస్తామంటూ కొంత మంది అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు 
గిరిజనుల నుంచి డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. 

మూడేళ్ల క్రితమే క్లియరెన్స్
ఉమ్మడి రాష్ట్రంలో 2008 లో పోడు పట్టాల కోసం ఆఫీసర్లు అప్లికేషన్లు తీసుకున్నారు. అప్పట్లోనే అర్హులైన వేలాది మందికి పట్టాలను అధికారులు అందజేశారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి, టేకులగూడెం, తొడితలగూడెంలో మాత్రం అనర్హులను పట్టాలు ఇస్తున్నారనే ఫిర్యాదులు రావడం, కొంత మంది కోర్టులకు వెళ్లడంతో  అప్లికేషన్లు పెండింగ్ లో ఉంచారు. మూడేళ్ల క్రితం డిస్ట్రిక్ట్  లెవల్  కమిటీ(డీఎల్సీ) ఆధ్వర్యంలో పోడు పట్టాల పంపిణీకి లైన్​ క్లియర్​ అయింది. అప్పటి నుంచే  లబ్ధిదారులకు రైతుబంధు కూడా బ్యాంక్​ అకౌంట్లలో జమ అవుతోంది. కానీ పట్టా పుస్తకాలు చేతికి రాకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బంది పడుతున్నారు. గిరి వికాస్​ పథకాన్ని ఉపయోగించుకొనే అవకాశం లేకపోవడం, మరోవైపు ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టాల్లేని కారణంగా అవి అటవీ భూములేనంటూ ఇబ్బంది పెడుతుండడం కామన్​ గా మారింది. దీంతో పట్టాలు ఇప్పించాలంటూ స్థానిక గిరిజనులు ఎమ్మెల్యే రాములు నాయక్​ను కలిసి సమస్య చెప్పుకున్నారు. ఆయన త్వరలోనే పంపిణీ చేస్తామంటూ దాటవేస్తూ వచ్చారు. 

బ్రోకర్ల వసూళ్ల పర్వం..
గిరిజనుల ఇబ్బందులను ఆసరా చేసుకొని కొంత మంది అధికార పార్టీ నేతలు బ్రోకర్ల అవతారమెత్తారు. తహసీల్దార్​ ఆఫీస్​లో ఉన్న పట్టాలు ఇవ్వాలంటే డబ్బులు ఖర్చవుతాయంటూ గిరిజనులకు ఆశచూపించారు. ఆఫీసర్లకు డబ్బులిస్తేనే పనులవుతాయంటూ నచ్చజెప్పారు. ఒక్కో గిరిజన రైతు నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ముగ్గురు దళారులు ఎకరానికి రూ.5 వేల చొప్పున డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం గత వారం మూడు గ్రామాలకు చెందిన 428 మంది లబ్ధిదారులకు1,284 ఎకరాలకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్​ పట్టా పాస్​ బుక్​లను ఆఫీసర్లు సీక్రెట్ గా అందజేశారు. ఒక గ్రామంలో డబ్బులు తీసుకున్న బ్రోకరే, లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పాస్​బుక్​లను ఇచ్చినట్లు సమాచారం. ఆఫీసర్లు అధికారికంగా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించకుండా గుట్టుచప్పు డు కాకుండా దళారుల ద్వారా పాస్​ బుక్​లను పంపిణీ చేయడం వెనుక డబ్బులు చేతుల మారడమే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

రూ.25 వేలు ఖర్చయింది
అటవీ హక్కు పత్రం పొందేందుకు మొదట్నుంచీ ఇప్పటి వరకు రూ.25 వేల రూపాయలు ఖర్చయింది. దళారులు ఎకరానికి రూ.5 వేల చొప్పున వసూలు చేశారు. హక్కు పత్రాలు వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడ్డాం. రెండు రోజుల క్రితం రాత్రిపూట ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. - జర్పుల మోహన్, రేలకాయలపల్లి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పంపిణీ
నేను కొద్ది నెలల క్రితమే ఇక్కడ బాధ్యతలు తీసుకున్నా. ముందు నుంచే పోడు పట్టా పుస్తకాలు ఆఫీస్​లో పెండింగ్ లో ఉన్నాయి. పోడు రైతుల ఆందోళన విషయాన్ని ఇటీవల ఉన్నతాధికారులకు వివరించగా, పట్టాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం లబ్ధిదారులకు అందజేశాం. డబ్బులు వసూలు చేశారనే  ఆరోపణలు అవాస్తవం.  – కోట రవికుమార్, తహసీల్దార్, కారేపల్లి