
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
మెదక్, వెలుగు : ‘పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు. పోడు గ్రామాల ఎంపిక ఏ తీరుగా చేసిన్రు? ఎవరు చేసిన్రు? పోడు భూములు ఉన్న చాలా గ్రామాలను ఎందుకు స్కిప్ చేసిన్రు? ట్రెంచ్ బయట భూములను ఎట్లా స్వాధీనం చేసుకుంటరు?’ అని ఫారెస్ట్ ఆఫీసర్లపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెదక్ జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ చైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగింది. అటవీ శాఖపై సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సర్వే ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. మెదక్ నియోజకవర్గంలోని మెదక్, హవేలీఘనపూర్, చిన్నశంకరంపేట మండలాల్లోని పోడు భూములు ఉన్న 18 గ్రామాలు సర్వే లిస్ట్‌లో ఎందుకు లేవని అడిగారు. ఆయా చోట్ల 60 ఏండ్లకు పైగా పేద రైతులు పోడు భూములు కాస్తు చేసుకుంటుండగా, ఆ ఊర్లను పోడు జాబితాలో చేర్చకపోగా, ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్ బయట ఉన్న భూముల స్వాధీనానికి ప్రయత్నించడం, అక్కడ మొక్కలు నాటే ప్రయత్నాలు చేయడమేంటని నిలదీశారు. ఫారెస్ట్ - రెవెన్యూ డిపార్ట్మెంట్ల మధ్య వివాదంగా ఉన్న భూముల సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ ఫారెస్ట్ ఆఫీసర్లు పోడు గ్రామ సభల సమాచారం గ్రామ, మండల కమిటీ సభ్యులకు చెప్పడం లేదన్నారు. దీనిపై మెదక్ ఫారెస్ట్ రేంజ్‌ఆఫీసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జిల్లాలో 62 గ్రామ పంచాయతీలలో పోడు సర్వేకు పర్మిషన్ వచ్చిందని తెలిపారు. ఏవైనా గ్రామాలు మిగిలిపోయి ఉంటే సెకండ్ ఫేజ్‌లో సర్వే చేస్తామన్నారు. త్వరలో జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ నిర్వహించి పోడు పట్టాలకు అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. జాయింట్ సర్వే నిర్వహించి భూవివాదాలు పరిష్కరిస్తామని తెలిపారు.
స్కానింగ్ సెంటర్‌కు పర్మిషన్ ఎట్లిచ్చిన్రు..
నర్సాపూర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదురుగా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారని జడ్పీటీసీ బబ్యానాయక్ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులను స్కానింగ్ కోసం అక్కడికే పంపుతుండగా, వేలల్లో ఫీజు గుంజుతున్నారని ఆరోపించారు. యాక్సిడెంట్లో గాయపడిన వారు ఆసుపత్రికి వస్తే కనీసం డ్రెస్సింగ్ కూడా చేయకుండా సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ సమాచారం హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అయిన జడ్పీటీసీకి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దీనిపై డీసీహెచ్డాక్టర్చంద్రశేఖర్స్పందిస్తూ ఇక నుంచి సమాచారం ఇస్తామని, యాక్సిడెంట్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూస్తామన్నారు. ని జాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ మాట్లాడుతూ మెదక్ ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించుకునే పేషెంట్లకు డబ్బులు రావడం లేదని తెలిపారు. పరికరాలు లేకుండా ఈఎన్టీ డాక్టర్ రోగులకు ఎలా సేవలందిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందిస్తూ డయాలసిస్ పేషెంట్లకు డబ్బులు డీఆర్డీఏ నుంచి రావాల్సి ఉందన్నారు. ఈఎన్టీ పరికరాలకోసం ఆర్డర్ పెట్టామని, టెండర్ దశలో ఉన్నట్టు తెలిపారు.
కరెంట్ ఆఫీసర్ల తీరు సరిగా లేదు
కరెంట్డిపార్ట్మెంట్ ఆఫీసర్ల తీరు సరిగా లేదని పెద్దశంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ ఆరోపించారు. ఏఈ మండల జనరల్‌బాడీ మీటింగ్ కు రావడం లేదని, డీఈకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదన్నారు. దీంతో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. మన ఊరు, మన బడి పథకం కింద పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఎస్టిమేషన్ కాపీలు ఇవ్వకపోవడం సమస్యగా ఉందన్నారు. సామగ్రికి సంబంధించి ఏఈలు చెబుతున్నడ రేట్లు ఒకరకంగా ఉంటుండగా, బిల్ రికార్డు చేసే టైంలో ఎస్టిమేషన్ లో మరో రకంగా ఉండటంతో నష్టం వస్తోందన్నారు. దీనిపై స్పందించిన అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అందరికీ ఎస్టిమేషన్ కాపీలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ పాల్గొన్నారు.
అర్హులకు పింఛన్లు వస్తలేవు
వివిధ గ్రామాల్లో అర్హులైన వారికి ఆసరా పింఛన్లు ఎందుకు రావడం లేదని డీఆర్డీఓ శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. సదరం సర్టిఫికెట్ల విషయంలో సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. నిజాంపేట మండలంలో 98 మంది పేర్లు రోల్ బ్యాక్‌లో ఉన్నాయని జడ్పీటీసీ విజయ్ కుమార్ చెప్పారు. కౌడిపల్లి ఎంపీపీ రాజు మాట్లాడుతూ తమ మండలంలోని కొన్నిగ్రామాల్లో పింఛన్లు పొందుతున్న వ్యక్తులు చనిపోగా, అదే పేరున్న వారి పింఛన్లు క్యాన్సిల్ చేశారని, ఈ విషయం ఆఫీసర్లకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీడీఓ, పీడీ స్థాయిలో రోల్ బ్యాక్‌లో ఉన్న వాటి లిస్ట్ పంపాలని, ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి అర్హులకు పింఛన్లు మంజూరయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
స్కూళ్లలో వాష్‌రూమ్‌ల సమస్య..
కొల్చారం మండలం రంగంపేట హైస్కూల్లో 700 మందికి పైగా స్టూడెంట్స్ ఉండగా వాష్ రూమ్‌లు కొన్నే ఉండటంతో ఇబ్బంది కలుగుతోందని ఎంపీపీ మంజుల తెలిపారు. కొల్చారంలో ఒకే ప్రాంగణంలో నాలుగు స్కూళ్లు ఉన్నాయని, ఇక్కడ కూడా తగినన్ని వాష్ రూమ్‌లు లేవని, నీటి సౌకర్యం లేక విద్యార్థులు తిప్పలు పడుతున్నారని చెప్పారు. కొల్చారం జడ్పీటీసీ మేఘమాల మాట్లాడుతూ కొల్చారం పీహెచ్సీలో 8 మంది ఏఎన్ఏలకుగాను నలుగురు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు ఒక్కరు మాత్రమే ఉన్నారని, దీంతో వైద్యసేవలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. కొల్చారంలో వెటర్నరీ హాస్పిటల్ లో చాలా ఏళ్లుగా డాక్టర్ లేకపోవడం సమస్యగా ఉందన్నారు.