విద్యార్థుల అభివృద్ధికి పటేల్ శ్రీధర్రెడ్డి విశేష కృషి : కవి అందెశ్రీ

విద్యార్థుల అభివృద్ధికి పటేల్  శ్రీధర్రెడ్డి విశేష కృషి : కవి అందెశ్రీ

సూర్యాపేట, వెలుగు : విద్యార్థుల అభివృద్ధికి పటేల్​ శ్రీధర్​రెడ్డి విశేష కృషి చేశారని కవి అందెశ్రీ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బాలెంల గ్రామానికి చెందిన పటేల్ శ్రీధర్ రెడ్డికి ఇటీవల మర్యాలాండ్ యూఎస్ఏ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆదివారం సూర్యాపేటలోని ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథులుగా కవి అందెశ్రీ, తెలంగాణ రాష్ర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ పటేల్ శ్రీధర్ రెడ్డి స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి దాదాపు 25 ఏండ్లు పూర్తయిందన్నారు. 

నిరక్షరాస్యత నిర్మూలనలో భాగంగా శ్రీధర్​రెడ్డి మారుమూల గ్రామాల్లో వయోజన విద్య కేంద్రాలు నెలకొల్పి విద్యావలంటీర్లను నియమించారని తెలిపారు. విద్యావలంటీర్లకు గౌరవ భృతి ఇస్తూ అనేక మంది విద్యారుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అనంతరం పటేల్ రమేశ్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో 44 పాఠశాలల్లో పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆయన ఏడేండ్లపాటు రూ.2000 నుంచి 3000 స్కాలర్ షిప్స్​అందజేశారని తెలిపారు.  

బాలెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, గ్రీన్ బోర్డులు,  డెస్క్ బెంచీలు, గ్రంథాలయం, కళావేదిక వంట గదులు, మోడల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయించారని వివరించారు. రెండు ఎకరాల భూమిని ఉచితంగా పాఠశాలకు అందించి బాస్కెట్​బాల్​కోర్టు నిర్మించారని గుర్తుచేశారు. ఇలాంటి సేవా దృక్పథం కలిగిన శ్రీధర్ రెడ్డికి తమ్ముడిగా జన్మించడం తనకు గర్వంగా ఉందని రమేశ్ రెడ్డి తెలిపారు.