పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష ..పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ ...స్పెషల్ కోర్టు జడ్జి తీర్పు

పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష ..పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ ...స్పెషల్ కోర్టు జడ్జి తీర్పు

సుల్తానాబాద్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి కె. సునీత మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన యువతితో సుల్తానాబాద్ టౌన్ కు చెందిన షేక్ అన్వర్ అలియాస్ కట్ట అన్వర్ కు పరిచయమైంది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. లొంగదీసుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. చివరకు మోసగించడంతో 2018లో బాధితురాలు సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

షేక్ అన్వర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ను కోర్టులో దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుడు అన్వర్ పై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ  జడ్జి తీర్పు చెప్పారు. కేసులో నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను, సిబ్బందిని, ప్రాసిక్యూషన్ టీమ్ ను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.