హైదరాబాద్, వెలుగు: ‘మీ సెల్ ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా? లేదా మీరే ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఏం దిగులు చెందాల్సిన పనిలేదు. పోలీసులకు కంప్లైంట్చేస్తే సీఈఐఆర్ సిస్టమ్‌తో ట్రాక్ చేసి మీ ఫోన్‌ను దొరకబట్టి మీకు అప్పగిస్తారు.’ చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లను ట్రేస్ చేయడంలో రాష్ట్ర పోలీసులు సక్సెస్ అయ్యారు. సవాల్‌గా మారిన సెల్ ఫోన్స్ రికవరీ ప్రస్తుతం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) సిస్టమ్‌తో ఎంతో సులువైంది. ఈ సిస్టమ్‌పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో పాటు అన్ని పోలీస్ స్టేషన్స్ సిబ్బందికి అవగాహన కలిగించారు. టెలికం డిపార్ట్‌మెంట్‌తో కలిసి సీఈఐఆర్ సిస్టమ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇది సక్సెస్ కావడంతో ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా మే 17న పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే..
సెల్ ఫోన్స్ కోల్పోయిన బాధితులు ముందుగా స్థానిక మీ–సేవ సెంటర్స్‌లో నిర్దేశించిన చార్జెస్ చెల్లించి అప్లై చేసుకోవాలి. మీ–సేవ నిర్వాహకులు ఇష్యూ చేసిన రిసిప్ట్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందించాలి. కోల్పోయిన మొబైల్ నంబర్‌తో పాటు సమాచారం కోసం మరొక నంబర్, ఐఎంఈఐ నంబర్‌నూ ఇవ్వాలి. ఈ వివరాలతో పోలీసులు www.ceir.gov.in ద్వారా ట్రాక్ చేస్తారు. సెల్ ఫోన్స్ డేటాను జిల్లా నోడల్ ఆఫీసర్‌కి పంపిస్తారు. టెలికాం డిపార్ట్‌మెంట్‌తో నిరంతరం కో ఆర్డినేట్ చేస్తారు. మొబైల్లో వేరే సిమ్‌కార్డు వేయగానే ఆ నంబర్ తెలుస్తుంది. దాని ద్వారా ట్రేస్ చేసి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. ఐఎంఈఐ నంబర్ ద్వారా బాధితుల ఫోన్స్‌ను గుర్తిస్తారు. ఇలా ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 ఫోన్స్‌ను రికవరీ చేశారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో నోడల్ అధికారులను నియమించారు. వీరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్‌కు వచ్చే ఫిర్యాదులను సీఐడీలోని స్పెషల్ సెల్‌తో
మానిటరింగ్ చేస్తుంటారు.
బాధితులూ ట్రాక్ చేసుకోవచ్చు
మొబైల్ పోగొట్టున్న, చోరీకి గురైన వారు కూడా డైరెక్ట్‌గా తమ ఫోన్ ను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. సెల్ ఫోన్‌ను ట్రేస్ చేయడమే కాకుండా ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేయవచ్చు. దీంతో సెల్ ఫోన్‌లో మరో సిమ్ కార్డ్ వేసినా పనిచేయవు. బాధితుడు అన్‌లాక్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా సంబంధిత ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ-సేవలో తీసుకున్న రిసిప్ట్‌ను అప్‌లోడ్ చేయాలి. కమ్యూనికేషన్ కోసం ఈ-మెయిల్, ఆల్టర్నేట్ ఫోన్ నంబర్ ఇవ్వాలి.