నకిలీ నూనె, టీ పొడి ముఠా గుట్టు రట్టు

నకిలీ నూనె, టీ పొడి  ముఠా గుట్టు రట్టు
  • హైదరాబాద్ కేంద్రంగా సాగిన నకిలీ ప్యారాచుట్ కొబ్బరినూనె, రెడ్ లేబుల్ టీ పొడుల వ్యాపారం
  • ఏపీ తెలంగాణతోపాటు కర్ణాటక, చత్తీస ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్ధాన్  రాష్ట్రాలకు విస్తరించిన వ్యాపారం
  • తయారీదారులతోపాటు అమ్మకందారులను అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు

కర్నూలు: నకిలీ ప్యారాచూట్ కొబ్బరినూనె తోపాటు.. నకిలీ రెడ్ లేబుల్ టీ పౌడర్  తయారు చేసి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న తయారీ దారులు, అమ్మకందారులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఏడు రాష్ట్రాలకు విస్తరించింది ఈ నకిలీ వ్యాపారం. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు జిల్లా పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ ప్యారాచుట్ కొబ్బరినూనె, రెడ్ లేబుల్ టీ పొడి తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకున్న వ్యవహారం నడుపుతున్న ఇద్దరు తయారీ దారులతోపాటు ఏడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న అమ్మకందారులను కర్నూలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 
కర్నూలు పోలీసులు జరిపిన దాడుల్లో 
14,880 నకిలీ ప్యారా చూట్ కొబ్బరి నూనె నింపినబాటిల్స్( 113 బాక్సులు).
5,160  నకిలీ ప్యారా చూట్  కొబ్బరి నూనె నింపని ఖాళీ బాటిల్స్  (12 బాక్సులు).
1,680 నకిలీ రెడ్ లెబుల్ టీ పోడి నింపిన ప్యాకెట్లు ((40 బాక్సులు)
41,400 నకిలీ రెడ్ లెబుల్  టీ పోడి నింపని ప్యాకింగ్ ఖాళీ కవర్స్( 18 బాక్సులు) 
అరెస్టు అయిన  ముద్దాయిల వివరాలు...
కమల్ భాఠి(46), కాచిగూడ, హైదరబాద్ సిటి.
సంజయ్ (40),   ముసా పేట, హైదరాబాద్
దరూరు సత్యనారాయణ శెట్టి(49), నందికొట్కూరు టౌన్. కర్నూలు జిల్లా
టంగుటూర్ రవి కుమార్ (46), నంద్యాల టౌన్,కర్నూలు జిల్లా
షేక్ ఖాదర్ భాషా(46), ఎమ్మిగనూర్ టౌన్, కర్నూలు జిల్లా.
ఫిర్యాదుతో కదిలిన డొంక
ప్యారాచుట్ కొబ్బరినూనె, రెడ్ లేబుల్ టీ పొడి బ్రాండ్లను పోలిన నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్న వైనం బెంగళూరుకు చెందిన అన్వేష్ ఐపీఆర్ సర్వీస్ ఆథరైజ్డ్ కంపెనీ మేనేజర్ సోమసుందరం గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బలమైన సాక్షాధారాలు దొరకడంతో గత ఆగష్టు 27 న  ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి సరఫరా అయినట్లు ఆధారాలు దొరకడంతో ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేశారు. నందికొట్కూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 311/2021 u/S 420 IPCand Sec 51(B)(1) r/w 63 of  Copy Right Act of 1957 and Sec 103, 104 of the Trade Marks  Act 1999 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా దాడులు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా నకిలీ ప్యారా చూట్ కొబ్బరి నూనె బాటిల్స్ మరియు రెడ్ లెబుల్ టీ పౌడర్ అమ్ముచున్న వారిని పట్టుబడ్డారు. 
హైదరాబాద్ నుంచి దందా నడిపిన కమల్ భాఠి, సంజయ్
హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన కమల్ బాఠీ ప్యారా చూట్ కొబ్బరినూనె బాటిల్స్ ను పోలి ఉండే  బాటిల్స్ ను సిటీలోని ముసాపేటకు చెందిన సంజయ్  అనే వ్యక్తి ద్వారా తయారు చేయించుకుని వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. నకిలీ బాటిల్స్ లో తాము తక్కువ ధరకు కొన్న కొబ్బరి నూనె ను నింపి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, చత్తీస ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్లను నియమించుకుని, వారి ద్వారా షాపులకు సప్లై చేస్తూ అక్రమ తయారీ,  అక్రమ వ్యాపారం చేస్తున్నారు. వీరు కొబ్బరి నూనెలో 1:10 పరిమాణంలో ( Light Liquid Paraffin Chemical) కలిపి కల్తీ కొబ్బరి నూనె ను తయారు చేసి నకిలీ ప్యారా చూట్ బాటిల్స్ లలో ప్యాకింగ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. ఒరిజినల్ బాటిల్ ను పోలి ఉండే రీతిలో బాటిళ్లను తయారు చేసినా.. ఒరిజినల్ బాటిల్ క్వాలిటీ, థిక్ నెస్. ఫాంట్, రీసైక్లింగ్ సింబల్ లో తేడాలు ఉండడంతో అసలు తయారీదారులకు అనుమానం వచ్చి పట్టుపడ్డారు. నిందితులు హిందూస్ధాన్ యూనీ లివర్ కంపెనీకి చెందిన బ్రూక్ బాండ్ రెడ్ లెబుల్ టీ పౌడర్ బాక్సులను పోలిన నకిలీ ఖాళీ ప్యాకింగ్ కవర్స్ లలో నాసిరకం టీ పౌడర్ ను నింపి డీలర్ల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న విషయం పోలీసుల విచారణలో బయటపడింది. 
పట్టుపడిన నిందితులను జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి, సిసిఎస్ డిఎస్పి శ్రీనివాసులు, సి ఐ లు శేషయ్య , నాగరాఙా రావు, సీసీయస్ సిఐలు శేషయ్య, ఉపేంద్రబాబు, చంద్రబాబు & టీం,  హైదరాబాద్ కేంద్రంగా అక్రమంగా నకిలీ ప్యారా చూట్ ఆయిల్ తయారు చేస్తున్న  ప్రధాన నిందితుడైన కమల్ భాఠీని  అలాగే  బాటిల్స్ తయారు చేస్తున్న సంజయ్ ని అరెస్టు చేశారు.