సినిమా రేంజ్​లో పోలీసుల ఛేజింగ్..

సినిమా రేంజ్​లో పోలీసుల ఛేజింగ్..

నిజామాబాద్, వెలుగు : ట్రాన్స్‌‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌‌ వైర్లు దొంగలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌‌గేట్‌‌ వద్ద పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. లక్షలు విలువ చేసే కాపర్ వైర్లు చోరీ చేస్తున్న ముఠా కదలికలపై జిల్లా పోలీసులు చాలా రోజులుగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముప్కాల్ మండలంలో కాపర్‌‌ కాయిల్‌‌ చోరీ చేసిన అంతర్‌‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తున్నదని పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి ఇన్​ఫర్మేషన్ వచ్చింది. ఒక సీఐ, ఐదుగురు ఎస్ఐలు ఓ బృందంగా ఏర్పడ్డారు. ఇందల్వాయి టోల్​ప్లాజ్ వద్ద బారికేడ్లు అడ్డుగా పెట్టి బ్రెజా కారులో వెయిట్ చేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బలెనో కారులో టోల్ ప్లాజా వద్దకు వచ్చిన ముగ్గురు దొంగలను పోలీసులు గుర్తించారు. తమ ఐడీ కార్డులు చూయించి కిందికి దిగాలను కోరారు. ఈ క్రమంలోనే దొంగలు ఎదురుదాడికి దిగారు. పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. తర్వాత దొంగల కారును పోలీసులు వెంబడించారు. 

ఇందల్వాయి స్టేషన్​కు దొంగల కారు

చివరికి కామారెడ్డి వరకు ప్రయాణించిన దొంగలు.. కారును రోడ్డుపై ఆపేసి అడవిలోకి పారిపోయారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని ఇందల్వాయి స్టేషన్​కు తీసుకొచ్చారు. దొంగల ముఠా కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని సీఐ కళ్యాణ్ కృష్ణ తెలిపారు. టోల్​ ప్లాజా వద్ద కారు ఆపిన తర్వాత సరెండర్ కావాలని హెచ్చరించామని, అయినా వారు వినిపించుకోలేదని వివరించారు. తమ కారును ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. చివరికి తమపై కూడా కారు ఎక్కించేందుకు ట్రై చేశారని, అందుకే మూడు రౌండ్ల కాల్పులు జరిపామని వివరించారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్​తో ఉన్న కారు వివరాలు సేకరిస్తున్నామన్నారు. దొంగలు చత్తీస్​గఢ్​​కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.