జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని గంగపుత్ర కాలనీలో మూడు రోజుల కింద జరిగిన ముష్కె మహేశ్హత్య (27) కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వివరాలను జైపూర్ ఏసీపీ ఆఫీసులో ఏసీపీ నరేందర్ తెలియజేశారు. ఇందారం గ్రామానికి చెందిన పెద్దపల్లి కనకయ్య పెద్ద కూతురు శ్రుతి, అదే పంచాయతీ పరిధిలోని నజీరుపల్లికి చెందిన ముష్కె మహేశ్ ప్రేమించుకున్నారు.
మహేశ్ ప్రవర్తన నచ్చకపోవడంతో శ్రుతి రెండేండ్ల నుంచి మాట్లాడడం మానేసింది. తర్వాత శ్రుతి తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి చేసి పంపించారు. ఇది భరించలేని మహేశ్ ఏడాది కింద శ్రుతితో చనువుగా ఉన్న వీడియోలను తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ అవమానం భరించలేక శ్రుతి భర్త సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మహేశ్‌పై పీఎస్‌లో కేసు పెట్టినా వేధింపులు ఆపలేదు. శ్రుతి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఉంటున్నా తీరు మార్చుకోలేదు. ఇదంతా భరించలేని శ్రుతి కుటుంబం మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకుంది. పది రోజుల కింద ఓ కత్తిని కొని అదును కోసం వేచి చూశారు.
ఈ నెల25న మహేశ్..శ్రుతి ఇంటి ఎదుట నుంచి బండిపై వెళ్తూ హారన్ కొట్టాడు. మళ్లీ తిరిగి వస్తాడని ఆ కుటుంబం ఇంటి ముందే కాపు కాసింది. అనుకున్నట్టు రాగానే శ్రుతి తండ్రి పెద్దపల్లి కనకయ్య, భార్య పద్మ, కొడుకు సాయి, కూతురు శ్రుతి మహేశ్‌ను పట్టుకుని కత్తితో పొడిచారు. తలపై సిమెంట్ ఇటుకతో మోది చంపారు. మరో కూతురు శ్వేత సాయంతో అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం ఐదుగురు నిందితులు పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ఇందారం వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు షెట్పల్లి ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. ఒక సెల్ ఫోన్, కత్తి స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.