గంజాయి తాగుతున్న ఐదుగురి అరెస్ట్

గంజాయి తాగుతున్న ఐదుగురి అరెస్ట్
  •     500 గ్రాముల గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం 

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గంజాయి తీసుకువచ్చి, తాగుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వెంకటాపురం సీఐ బండార్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  వెంకటాపురం శివారు మల్లాపురం వెళ్లే దారిలోని శ్మశాన వాటిక వద్ద కొందరు వ్యక్తులు గంజాయి తాగుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లి యువకులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన చర్ల బొల్లె హేమంత్ కుమార్, రోహిత్, జాబీర్, వెంకటాపురానికి చెందిన కార్తీక్, ఉపేందర్ గా గుర్తించి, విచారించామన్నారు. కొన్ని నెలలుగా గంజాయి తాగే అలవాటు ఉండడంతో స్నేహం ఏర్పడిందని, చర్ల గ్రామం నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద 500 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ కుమార్ తెలిపారు. ఎస్సై అశోక్, రామచంద్రు సిబ్బంది పాల్గొన్నారు.