తనిఖీలు అంతంతే .. హైవేలు, జిల్లాల సరిహద్దుల వద్ద చెక్​పోస్టులతోనే సరి

తనిఖీలు అంతంతే ..  హైవేలు, జిల్లాల సరిహద్దుల వద్ద చెక్​పోస్టులతోనే సరి

మహబూబ్​నగర్, వెలుగు : ఎన్నికలు దగ్గరపడే కొద్దీ డబ్బుల అక్రమ తరలింపుపై ఫోకస్  పెంచాల్సిన అధికారులు చల్లబడుతున్నారు. జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో చెక్​పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాల సరిహద్దులు, నేషనల్​హైవేలపై చెక్​పోస్టులు పెట్టి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరులో ఇటీవల కొందరు లీడర్లు పలు గ్రామాలకు పెద్ద మొత్తంలో డబ్బుకట్టలు తరలిస్తున్నారన్న సమాచారంతో ప్రతిపక్షాల లీడర్లు వారి వెహికల్స్ ను వెంబడించారు. కానీ, పోలీసులే దగ్గరుండి రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేల వెహికిల్స్​ను దాటించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 

మొదట్లో కట్టుదిట్టం.. తర్వాత నామమాత్రం

గత నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. మొదట్లో పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీములు ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద మఫ్టీలో కానిస్టేబుళ్లను పెట్టారు. బ్యాంకుకు వెళ్లి రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చిన వెంటనే ఆ డబ్బును సీజ్​ చేశారని కొందరు బాధితులు ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్, సర్జరీలు, ఫంక్షన్ల కోసం డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకొని సీజ్​ చేశారని వాపోయారు. టార్గెట్  రీచ్​కావాలనే ఉద్దేశంతోనే పోలీసులు ప్రజల డబ్బును స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఇప్పుడు అదే ఆఫీసర్లు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నేషనల్​ హైవేలు, జిల్లాల సరిహదుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే వదలాల్సి ఉన్నా.. కొన్ని వాహనాలనే తనిఖీ చేసి మిగతా వాటిని వదిలేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. అనుమానం వచ్చిన వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారని డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు సైతం చెబుతున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు జరగడం లేదని ఆరోపణలు  ఉన్నాయి. ప్రతి మండల, జిల్లా కేంద్రం ఎంట్రెన్స్​వద్ద కేంద్ర బలగాలతో పోలీసులు చెకింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అలా జరగడం లేదు. ఉదయం పూట కొన్ని గంటలు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గ్రామాల్లో ఘర్షణలు

డబ్బు సంచులున్న వాహనాలతో లీడర్లు గ్రామాలకు వస్తుండడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అచ్చంపేటలో బీఆర్ఎస్​ అభ్యర్థి, సిట్టింగ్​ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రచార వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్​ లీడర్లు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూడు రోజుల కింద కోస్గి మండలం సర్జఖాన్​పేటలో బీఆర్ఎస్ కు చెందిన సోమశేఖర్​రెడ్డి అనే వ్యక్తి తన వాహనాల్లో ఓటర్లకు పంచేందుకు భారీగా డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్  లీడర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​ లీడర్లు ఘర్షణ పడ్డారు. ప్రశాంతంగా ఉండే గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాల లిస్టులో చేరుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కఠినంగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదని చెబుతున్నారు. 

లింక్  రోడ్లే.. షార్ట్​ కట్లు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బెంగళూరు, రాయచూరు, హైదరాబాద్  హైవేలను ఆనుకొని ఉన్న గ్రామాలకు పెద్ద మొత్తంలో డబ్బు సంచులు చేరుతున్నాయనే టాక్ నడుస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రాలకు రావడానికి ఉన్న లింక్ ​రోడ్లను నేతలు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్లలో ఎలాంటి తనిఖీలు లేకపోవడం వారికి కలిసి వస్తోంది. డబ్బు సంచులు ఉన్న వెహికల్​ కంటే ముందు మరో వెహికల్​ అనుకున్న రూట్​లో వెళ్తుంది. ఎలాంటి తనిఖీలు లేవని నిర్ధారించుకున్నాక డబ్బున్న వెహికల్ ను నేరుగా గ్రామాలకు చేరుస్తున్నారు. ఒకవేళ తనిఖీలు ఉంటే డబ్బున్న వెహికల్  రూట్​ను మారుస్తున్నారు.