మావోయిస్టుల సంచారంతో ఆదిలాబాద్​లో పోలీసుల కూంబింగ్

మావోయిస్టుల సంచారంతో ఆదిలాబాద్​లో పోలీసుల కూంబింగ్
  • ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనుల ఆందోళన

ఆసిఫాబాద్/నిర్మల్/బోథ్​, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారంలో పోలీసులు అలర్ట్​అయ్యారు. మరో నెల రోజుల్లో మన్యం వీరుడు కుమ్రంభీం వర్ధంతి ఉండగా.. ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మొదటి నుంచి ఏజెన్సీ ప్రాంతాలు అన్నలకు అడ్డాగా ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన గుట్టలు, కొండలను అనుకూలంగా మల్చుకుని మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా భావించే ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలో ఐదు రోజులు మకాం వేసి మావోయిస్టుల ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించారు. సెప్టెంబర్ 2020లో కాగజ్ నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఘటనలో మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడెల్లు అలియాస్ భాస్కర్ తో పాటు మరికొందరు తప్పించుకున్నారు. పోలీసుల చర్యలతో మావోయిస్టులు పొరుగు రాష్ట్రాలకు స్థావరాలను మార్చారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఏజెన్సీ లో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తిరిగి కొద్దిరోజులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాస్థాయి పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహకరించవద్దని సూచనలు ఇస్తున్నారు. పోస్టర్లను రిలీజ్ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.

రిక్రూట్ మెంటా లేక షెల్టరా..
రెండేళ్లు స్తబ్దుగా ఉన్న ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ జిల్లా ఇన్​చార్జ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, ఆయన భార్య కంతి లింగవ్వ అలియాస్ అనితతో పాటు మరో సీనియర్ మావోయిస్టు మంగు, వర్గీస్ తదితరులు ఉమ్మడి జిల్లాలో  వారం రోజులుగా సంచరిస్తున్నారన్న సమాచారం పోలీసులకు  చేరింది. మావోయిస్టులు కొత్త దళ సభ్యుల రిక్రూట్ మెంట్ కోసం వచ్చారా లేక షెల్టర్ తీసుకోవడం కోసమా.. లేదా మరేదైనా యాక్షన్ ప్లాన్ తో వచ్చారా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో 10 నుంచి 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారంటూ వారి పోస్టర్లను ఎస్పీ సురేశ్​కుమార్ రిలీజ్ చేశారు. మొత్తానికి ఏజెన్సీ గ్రామాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు స్వయంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించడంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు ప్రజలు సహకరించవద్దని ఎస్పీలు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు లెటర్లు విడుదల చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగి –ఇంద్రవెల్లి దళం పేరిట హెచ్చరిక లెటర్లు సైతం విడుదల చేయడం గమనార్హం. ముఖ్యంగా జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ను టార్గెట్ చేసుకుని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈయనది బోథ్ మండలం పొచ్చర గ్రామం. గతంలో చాలాసార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి పరారయ్యారు. తాజాగా బోథ్ మండలంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. బోథ్​ మండలానికి ఆనుకొని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో గురువారం కూంబింగ్​ చేస్తుండగా కైలాస్ టేకిడి ఆలయ సమీపంలో దారి పక్కన గ్రెనేడ్ కనిపించింది. అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, బోథ్, బజార్ హత్నూర్, సిరికొండ మండలాల్లో పోలీసులు ప్రత్యేక దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
ఇటీవల గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలిసింది. యువత మావోయిస్టు, తీవ్రవాద కార్యకలాపాలకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మావోయిస్టు దళసభ్యుల కదలికలు ఉన్నట్లు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 కు కాల్ చేసి తెలియజేయాలి. చెప్పినవారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. వారికి తగిన బహుమతి ఇస్తాం. - ఎస్పీ కె.సురేశ్​కుమార్, ఆసిఫాబాద్​