
మెదక్ (నిజాంపేట), వెలుగు : నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్సైలు, 40 మంది పోలీస్ సిబ్బందితో 250 ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆయా ఇళ్లలో నివాసం ఉంటున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెహికల్స్తనిఖీ చేసి నంబర్ ప్లేట్, డాక్యుమెంట్లు సరిగాలేని 50 వెహికల్స్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసులపై ప్రజల్లో ఉన్నటువంటి దురభిప్రాయాలను తొలగించడానికి, సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడం కోసం ప్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు సరైన పత్రాలను చూపించి వాటిని తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సర్పంచ్ నరసింహారెడ్డి వ్యక్తి గతంగా రూ.50 వేల చెక్కును, గ్రామ పంచాయతీ నుంచి రూ.75 వేల నగదును సీఐకి అందజేశారు. ఎస్సై లు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్, సుభాష్ గౌడ్, పోచయ్య, నర్సింలు, ఎంపీటీసీ బాల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేశ్, సంగెపు నారాయణ పాల్గొన్నారు.
‘గీతం’ను సందర్శించిన జర్మనీ ప్రతినిధుల బృందం
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీని జర్మనీకి చెందిన ‘రోజ్’ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. సమాజ సాధికారత గ్రామీణ సంస్థ (రోజ్) ప్రతినిధులు రాబర్ట్ ఫెల్లెనెర్, డైట్మార్లతో పాటు ఇండియా ప్రతినిధులు వి. శేషయ్య, వై.వీ రావు తదితరులు ఎస్ఎస్ఎస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనంతరం రోజ్ బృందం రుద్రారం గ్రామంలోని స్కూల్‌కు బహూకరించిన కంప్యూటర్ ల్యాబ్, సోలర్ సిస్టమ్‌ను ప్రారంభించారు. సోలర్ సిస్టమ్‌కు గ్రిడ్‌ను కూడా అమర్చామని, దాని ద్వారా స్కూల్‌కు కొంత ఆదాయం వస్తుందని వారు తెలిపారు. వచ్చే ఏడాది కుట్టు మిషన్లు, పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు
మెదక్ (శివ్వంపేట), వెలుగు : ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు మరో ఐదు రోజులు పొడిగించామని ఉమ్మడి మెదక్ జిల్లా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం ఆయన శివ్వంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్, టెన్త్ అడ్మిషన్స్ కు అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి
మెదక్ టౌన్(చిలప్‌చెడ్), వెలుగు : పోలీస్స్టేషన్లను రోజూ పరిశుభ్రంగా ఉంచాలని, బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పోలీసులకు సూచించారు. మంగళవారం చిలప్‌చెడ్ పోలీస్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని, ప్రజా ఫిర్యాదులపూ తక్షణమే స్పందించాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఆన్ లైన్ విధానంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి పిటిషన్‌ను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం ఎస్పీ చిలప్‌చెడ్ నూతన పోలీస్‌స్టేషన్ సంబంధించి శీలంపల్లి క్రాస్ రోడ్డు వద్ద స్థలంతోపాటు శీలంపల్లి బస్టాండ్ పక్క సర్వే నంబర్లు 381, 384, 385, చిలప్‌చెడ్‌కు చెందిన పట్టా ల్యాండ్ సర్వే నంబర్ 172,173, చండూరులో పరంపోగు సర్వేనెంబర్- 2లో స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ వెంట ఎంపీపీ వినోద, ఎస్సై మహ్మద్ గౌస్, నాయకులు దుర్గారెడ్డి ఉన్నారు.
వడియారంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపండి
కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే రఘునందన్ రావు వినతి
మెదక్ (చేగుంట)/దుబ్బాక, వెలుగు: ప్రయాణికుల సౌకర్యార్థం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని వడియారంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని చేగుంట పారిశ్రామిక ప్రాంతంలో 10 రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు, కూలీలు పని చేస్తుంటారని, ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కార్మికుల కోసం విశాఖ, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్లను వడియారం రైల్వే స్టేషన్లో స్టాప్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం వడియారంలో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే రైతులకు ఫర్టిలైజర్ కొరత తీరడమే కాకుండా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తానిచ్చిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
సోమేశ్ కుమార్ ను రిలీవ్ చేయాలి
రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ నియామకాన్ని హైకోర్టు కొట్టి వేయడాన్ని బీజేపీ స్వాగతిస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం చేగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ పాలనలో తెలంగాణ ప్రాంత ఐఏఎస్ అధికారులు వివక్షకు గురవుతున్నారన్నారు. బీహార్ రాష్ట్ర ఉన్నతాధికారుల పాలన తమకు వద్దని పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను చేసిన ఫిర్యాదు కరెక్టేనని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం తప్పని హైకోర్టు ఉత్తర్వులు ద్వారా స్పష్టమైందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రాంత ఐఏఎస్ అధికారిని సీఎస్ గా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రా సంపాదనను దోచు కోవడానికే చీఫ్ సెక్రటరీగా మరో మూడు వారాలు ఎక్సటెన్షన్ ఇవ్వాలని కోర్టులో సోమేశ్ కుమార్ తరపు న్యాయవాదులు వాదించారన్నారు. ఎమ్మెల్యే వెంట చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేశ్, గొల్లపల్లి సర్పంచు ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రఘువీర్ రావ్, నాయకులు ఆంజనేయులు, స్వామి, సంతోష్ రెడ్డి, గోవింద్, హరిశంకర్, చంద్రశేఖర్ గౌడ్, సాయిబాబా ఉన్నారు.
‘కంటి వెలుగు’ను సక్సెస్ చేయాలి
జహీరాబాద్, వెలుగు : ఈనెల 18 నుంచి చేపట్టనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని డాక్టర్లు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు కోరారు. మంగళవారం జహీరాబాద్ లోని మున్సిపల్ మీటింగ్ హాల్లో జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, పీహెచ్సీ డాక్టర్లు, సిబ్బందితో నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
దర్గాలో ఎమ్మెల్యే ప్రార్థనలు
మునిపల్లి (కోహీర్), వెలుగు : కోహిర్ మండల కేంద్రంలోని హజరత్ మౌలానా ముజుద్దీన్ దర్గాలో ఉర్సు సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రోడ్డు నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దర్గా కమిటీ అధ్యక్షుడు షౌకత్, నాయకులు పాల్గొన్నారు.
హత్నూరలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి..
సంగారెడ్డి(హత్నూర), వెలుగు : హత్నూర రైతు వేదిక మీటింగ్ హాల్లో మంగళవారం కంటి వెలుగు ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవెందర్ రెడ్డి, ఎంపీడీవో శారదాదేవి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీపీ నర్సింలు పాల్గొన్నారు.
పుల్కల్లో జడ్పీ చైర్ పర్సన్..
పుల్కల్, వెలుగు : పుల్కల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో కంటి వెలుగు నిర్వహణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీవో మధులత పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
సిద్దిపేట రూరల్, వెలుగు : పోలీస్ అధికారులు 2021–22 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలని సీపీ ఎన్. శ్వేత ఆదేశించారు. మంగళవారం సీపీ ఆఫీస్ లో గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్ ఉన్న దొంగతనాల కేసులను త్వరగా ఛేదించాలన్నారు. రౌడీలు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలని చెప్పారు. పోక్సో, ఉమెన్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా నిర్మూలనకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, గజ్వేల్ ఏసీపీ రమేశ్, ఎస్బీ ఏసీపీ రవీందర్ రాజు, సీసీఆర్బీ ఏసీపీ చంద్రశేఖర్, సీసీఆర్బీ సీఐ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సీఐ వీరప్రసాద్, కమలాకర్, రాజశేఖర్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
బద్నాం చేస్తున్నారని వ్యక్తి సూసైడ్
రామాయంపేట,వెలుగు : తనను బద్నాం చేస్తున్నారని ఓ వ్యక్తి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జరిగింది. మృతుడి బంధువుల తెలిపిన ప్రకారం... పట్టణానికి చెందిన దేవుని మల్లేశం రెండవ కొడుకు నాగరాజు(27) స్థానిక ఓ ప్రైవేట్ కాలేజ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆ కాలేజ్ అకౌంట్లో తేడా రాగా మేనేజ్ మెంట్అతడిని బాధ్యుడిని చేసి ఇటీవల విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి నాగరాజు ఓ షాప్ లో పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం కాలేజీ యాజమాన్యం పిలవడంతో వెళ్లివచ్చాడు. సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన అతడు ‘నేను తప్పు చేయకున్నా కావాలనే బద్నాం చేస్తున్నారు. నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఐఆమ్సారీ’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇది చూసిన అతడి కుటుంబ సభ్యులు వెంటనే అతడి కోసం వెతికారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక కొత్త చెరువు వద్ద అతడి చెప్పులు కనిపించాయి. చెరువులో గాలించగా నాగరాజు డెడ్‌బాడీ లభ్యమైంది. కాలేజీ యాజమాన్యం నాగరాజును బద్నాం చేయడంతోనే అతడు సూసైడ్ చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సామాజిక సేవలో ముందుండాలి
రామచంద్రాపురం, వెలుగు : సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు ముందుండాలని మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. రామచంద్రాపురంలోని గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్టూడెంట్లకు మలబార్గోల్డ్చారిటేబుల్ట్రస్ట్ మంగళవారం ఆర్ధిక సహాయాన్ని అందించింది. 210 మంది విద్యార్థులకు రూ. 8 వేల చొప్పున పారితోషికం అందజేసింది. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు కష్టపడి కాలేజీ నిర్మాణం పూర్తి చేశానని, ఏటా వివిధ సంస్థలు చేస్తున్న సహాయాన్ని మరవలేనని తెలిపారు. కాలేజీకి రూ.2.50 లక్షల విలువైన డెస్కులను రాఘవరావు, సీసీ కెమెరాలు, నోట్ బుక్స్ నేతి జగదీశ్, బెంచీలు సత్యనారాయణ రెడ్డి, చైర్లు మనదీప్ రెడ్డి తదితరులు అందజేశారు. కార్యక్రమంలో మలబార్గోల్డ్మేనేజర్ దీపక్, మార్కెటింగ్ మేనేజర్ అజిత్, ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధికి తోడ్పాటు
సంగారెడ్డి టౌన్, వెలుగు : పరిశ్రమలు సీఎస్ఆర్నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి చేయూతనివ్వాలని కలెక్టర్ డాక్టర్ శరత్ యాజమాన్యాలను కోరారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో అడిషనల్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జిల్లాలోని క్లస్టర్ 5లోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు, సీఎస్ఆర్ నిధుల జిల్లా పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టర్న్ ఓవర్ ప్రాఫిట్ లో రెండు శాతం కలెక్టర్ ఖాతాలో జమ చేయాలని సూచించారు. కంపెనీ యాక్ట్, సీఎస్ ఆర్ గైడ్‌లైన్స్ విధిగా పాటించాలని కోరారు. సీఎస్ఆర్ లో ఏ పనులు చేపట్టినా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు ముందు తెలియజేసి కలెక్టర్ ఆమోదం తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీవో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ను సక్సెస్ చేయాలి
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో సక్సెస్ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో 17,11,685 మందికి స్క్రీనింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 854 క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్ కమిషనర్లు కంటి వెలుగు క్యాంపుల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
ఇండియాకే రోల్ మోడల్ తెలంగాణ:మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు
చేర్యాల, వెలుగు: ఇండియాకే రోల్ మోడల్‌గా తెలంగాణ అభివృద్ధి చెందిందని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం చేర్యాల, దూల్మిట్ట మండల కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో కలిసి వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతా ప్రవేశపెట్టేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. చేర్యాల, దూల్మిట్ట మండలాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించిందని తెలిపారు. అంతకుముందు వారు చేర్యాల మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో రూ. 6 కోట్లతో చేపడుతున్న 30 పడకల సర్కార్ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేశారు. దూల్మిట్ట మండల కేంద్రంలోని పద్మశాలీ భవనం, రెడ్డి సంఘ భవనం, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇటీవల హత్యకు గురయిన చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం కుటుంబాన్ని గుర్జకుంటలో పరామర్శించారు. వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ రోజారాణి శర్మ, ఎంపీపీలు బి. కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కర్ణాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎ. స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎస్ మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్ పి. వెంకట్‌రెడ్డి, కొమురవెల్లి టెంపుల్ చైర్మన్ జి. భిక్షపతి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దృష్టి లోపంతో ఎవరూ బాధపడొద్దు..
సిద్దిపేట రూరల్, వెలుగు : దృష్టి లోపంతో ఎవరూ బాధపడొద్దనే కంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రెండో విడత ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం సిద్ధిపేట కలెక్టరేట్ లో కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలు 100 రోజుల పాటు పనిచేస్తాయని తెలిపారు.
మార్చిలోపు ఐటీ టవర్ పూర్తి కావాలి..
సిద్దిపేట లో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను మార్చిలోపు పూర్తి చేసి ఏప్రిల్ మొదటి వారం లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట లో నిర్మిస్తున్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
పదిలో మళ్లీ మనమే ఫస్ట్ రావాలి
ఈసారి కూడా టెన్త్‌లో సిద్దిపేట జిల్లానే ఫస్ట్ రావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. కలెక్టర్ ఆఫీస్ లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యా శాఖ అధికారులు, స్కూల్ హెచ్ఎం లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ కు రూ.25 వేలు,10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
అధికారుల అండతో కబ్జాలు
అన్నారంలో భూ కుంభ కోణంపై బీజేపీ రాష్ట్ర నాయకుడు నందీశ్వర్ గౌడ్
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : పటాన్చెరు నియోజకవర్గంలో భూ దోపిడీ అంతులేకుండా పోతోందని, భూ కబ్జాదారులకు కొందరు అధికారులే అండగా ఉంటున్నారని, భూ భకాసురుల భరతం పడతామని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఫైర్అయ్యారు. మంగళవారం గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం గ్రామంలో భూ కబ్జాల విషయమై రైతులను కలిసి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని భూ ఆక్రమణలు పత్రికల్లో వస్తున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. కబ్జాదారులకు అనుకూలంగా ఉన్న అధికారులకు బదిలీ పేరుతో పటాన్చెరు మండలాలకు రప్పించుకుని యథేచ్ఛగా భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 261లో రూ.1500 కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని సర్పంచ్‌గా ప్రశ్నిస్తే అతడు సస్పెండ్ కు గురికావాల్సి వచ్చిందన్నారు. ఆ సర్పంచ్‌కు ప్రాణాపాయంగా పరిస్థితులు మారడంతో అతడు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌పెట్టి భూ కబ్జాలను బట్టబయలు చేసినా అధికారులు తీరులో మార్పురావడంలేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు ఇప్పటికైనా ఆ భూములు బాధిత రైతులకు చెందేలా చూడాలని, లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళను చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజశేఖర్‌రెడ్డి, ఐలేశ్, ఉదయ్కుమార్పాల్గొన్నారు.