- ఆరోగ్య సమస్యలే కారణమంటూ దూకడానికి ముందు సెల్ఫీ వీడియో
- గల్లంతైన కానిస్టేబుల్ కోసం పోలీసుల గాలింపు
భద్రాచలం, వెలుగు : ఆరోగ్య సమస్యలు భరించలేక ఒక కానిస్టేబుల్ భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు. ఆయన కోసం గజఈతగాళ్ల సాయంతో నదిలో పోలీసులు గాలిస్తున్నారు. పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని శుక్రవారం గోదావరిలో దూకాడు. ఆయన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇటీవల కారు యాక్సిడెంట్‌కు గురైన తాను అనారోగ్యం పాలయ్యాయని, తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని
దీనికి తోడు ఖమ్మంలో తన తండ్రి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వరదల్లో మునిగిపోయిందని.. మనస్తాపంతో రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అందులో పేర్కొన్నాడు. బ్రిడ్జిపై వదిలేసిన రమణారెడ్డి సెల్‌ఫోన్, చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా అతని ఆచూకీ ఇంకా దొరకడం లేదని గజఈతగాళ్లు చెబుతున్నారు.